కృతి సనన్ యాడ్ రగడ.. నెటిజన్ల నీతులకు చిన్మయి ఘాటు కౌంటర్!

Kriti Sanon Ad Controversy Chinmayi Sharp Counter To Netizens
  • కృతి సనన్ రక్షా బంధన్ యాడ్ వివాదాస్పదం
  • ఆమె ధరించిన దుస్తులు భారతీయ సంస్కృతి, రాఖీ పండుగ పవిత్రతకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు
  • డేరా బాబాకు పదేపదే లభిస్తున్న పెరోల్ గురించి ఎందుకు మాట్లాడరన్న చిన్మయి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఒక రక్షా బంధన్ వాణిజ్య ప్రకటన (యాడ్) తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్‌లో కృతి ధరించిన దుస్తులు భారతీయ సంస్కృతి, రాఖీ పండుగ పవిత్రతకు విరుద్ధంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.


ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృతి సనన్‌ను విమర్శిస్తున్న వారి వైఖరిని ఎండగడుతూనే... అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పదేపదే పెరోల్ లభిస్తున్న అంశాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.


ఒక మహిళ వేసుకున్న దుస్తులను, ఒక ప్రకటనను 'సంస్కృతి' పేరుతో తప్పుపట్టే సమాజం... తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తికి వరుసగా పెరోల్‌లు లభిస్తుంటే ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని చిన్మయి ప్రశ్నించారు. మహిళల బట్టలపై నీతులు చెప్పే జనాలు, ఇలాంటి తీవ్ర నేరస్థుల విషయంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఏ రకమైన న్యాయమని నిలదీశారు.


చిన్మయి చేసిన ఈ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది. ఆమె లేవనెత్తిన సామాజిక కోణాన్ని, నిలదీతను పలువురు సమర్థిస్తుండగా... రాఖీ యాడ్ వివాదాన్ని నేరస్థుడి పెరోల్ అంశంతో ముడిపెట్టడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కృతి సనన్ రాఖీ యాడ్, దానిపై చిన్మయి స్పందించిన తీరు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Kriti Sanon
Chinmayi Sripada
Raksha Bandhan Ad Controversy
Gurmeet Ram Rahim Singh Parole
Bollywood News
Social Media Trolling

More Telugu News