పేద మహిళలకు ఏటా రూ. 40 వేలు: అఖిలేశ్ యాదవ్ భారీ ఎన్నికల హామీ
- త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు
- పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్న బీజేపీ, ఎస్పీ
- ఉద్యోగాల్లో మహిళలను 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న అఖిలేశ్
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో మూడోసారి పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యూహాలు రచిస్తుండగా... ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలను గుప్పిస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కీలక ప్రకటనలు చేశారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, 12వ తరగతి పూర్తయిన 25 లక్షల మంది బాలికలకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించారు. వీటితో పాటు ‘రాణి లక్ష్మీబాయి పథకం’ ద్వారా విద్యార్థినులకు 50 వేల ఉచిత స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తూ అఖిలేశ్ యాదవ్ ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ వేదికగా 10 భారీ హామీలతో ముందుకు వచ్చారు. పేద మహిళలకు ఏటా రూ. 40 వేలు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఈ మొత్తాన్ని పెంచుతామని మాటిచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ప్రతి నెలా 2 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, వితంతువులు, నిరుపేదలకు శాశ్వత గృహాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
విద్యా రంగానికి సంబంధించి 12వ తరగతి బాలికలకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఫీజు మాఫీ, ప్రైవేట్ బడుల్లో సగం ఫీజు భరిస్తామని తెలిపారు. ప్రతి తహసీల్‌లో పీజీ కళాశాల, జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు, మూతపడిన 26 వేల పాఠశాలలను తిరిగి తెరిపిస్తామని, మహిళలపై నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నెలకొల్పుతామని వెల్లడించారు.