ఇలా అయితే ‘మళ్లీ అదే తప్పు చేస్తారు’.. జైస్వాల్‌-ఫెర్నాండో వివాదంపై మంజ్రేకర్‌ ఫైర్‌

Sanjay Manjrekar warns players will repeat mistakes after Yashasvi Jaiswal controversy
  • జైస్వాల్‌-ఫెర్నాండో వివాదంపై మంజ్రేకర్‌ విమర్శలు
  • తేలికైన చర్యలు ఆటగాళ్లను ప్రోత్సహిస్తాయని వ్యాఖ్య
  • ఇద్దరికీ 25 శాతం మ్యాచ్‌ ఫీజు జరిమానా
  • ఇద్దరికీ చెరో డీమెరిట్‌ పాయింట్‌
  • వైభవ్‌ ఘటనను కూడా ప్రస్తావించిన మంజ్రేకర్‌
భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వివాదంపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించారు. ఆటగాళ్ల తప్పిదాలపై తేలికగా వ్యవహరిస్తే.. వారు మళ్లీ అదే ప్రవర్తనకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలు ఆటకు, ముఖ్యంగా ఆటగాళ్ల భవిష్యత్తుకు మంచిది కాదని పేర్కొన్నారు.

కొలంబోలో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్‌ ఔటైన తర్వాత ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జైస్వాల్‌ హెల్మెట్‌ ఫెర్నాండో నుదుటికి తగిలింది. ఘటనపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఇద్దరు ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఒక్కొక్కరికి ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా ఇచ్చింది.

ఈ వ్యవహారంపై మంజ్రేకర్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. వైభవ్‌ సూర్యవంశీ ఘటనను కూడా ప్రస్తావిస్తూ ఐసీసీ, బీసీసీఐను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లను ఇలాంటి ప్రవర్తన నుంచి తప్పించుకుంటూ పోతే.. అదే పని మళ్లీ చేసేలా ప్రోత్సహించినట్టవుతుందని అన్నారు.

ఇటీవల శ్రీలంక ‘ఏ’తో మ్యాచ్‌ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ కూడా వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంక ‘ఏ’ ఆటగాడు విషెన్‌ హలంబగేతో అతడు భౌతిక ఘర్షణకు దిగాడు. అప్పట్లో మంజ్రేకర్‌ ఈ ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు. తాను ఇండియా ‘ఏ’ మేనేజ్‌మెంట్‌లో ఉంటే తదుపరి మ్యాచ్‌కు వైభవ్‌ను తప్పించేవాడినని చెప్పారు.

జైస్వాల్‌ కూడా తనపై వచ్చిన విమర్శలకు స్పందించాడు. వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన తర్వాత జైస్వాల్‌ స్పందిస్తూ.. అసలు ఏం జరిగిందో తెలియకుండా తీర్పు ఇవ్వొద్దని కోరాడు. ఎవరైనా హద్దు దాటితే భారత్‌ పోరాడుతుందని, తగిన సమాధానం ఇస్తుందని వ్యాఖ్యానించాడు.
Advertisement
Yashasvi Jaiswal
Sanjay Manjrekar
Asitha Fernando
India vs Sri Lanka Test
ICC Fine
Vaibhav Suryavanshi

More Telugu News