నా నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు: మాధవరం కృష్ణారావు
- నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమన్న మాధవరం
- ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక
- తనపై పగ ఉంటే తన ప్రాణాలు తీయాలని వ్యాఖ్య
కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని మూడు భాగాలు చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. దీంతోపాటు, 22ఏ నిబంధనలపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల హక్కుల కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
తనను నియోజకవర్గ ప్రజలు 70 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిపించారని, హైదరాబాద్‌లోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకులలో తాను ఒకడినని మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. తనపై ఏమైనా వ్యక్తిగత కోపం లేదా పగ ఉంటే నేరుగా తన ప్రాణాలు తీయాలని, కానీ తనను నమ్ముకున్న ప్రజలను సతమతం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుత ప్రభుత్వం కూకట్‌పల్లిని హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిలోకి విభజించి మూడు ముక్కలు చేసిందని ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే కక్షతోనే నియోజకవర్గంపై ఈ రకమైన చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే 22ఏ నిషేధిత జాబితా నుంచి స్థానిక కాలనీల భూములను, ఆస్తులను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.