అమెరికాలో మోహన్ భగవత్ పర్యటనను నిలిపివేయడం సరికాదని చెప్పాను: కేఏ పాల్

KA Paul says stopping Mohan Bhagwat US visit is not right
  • ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కోసం అమెరికాకు వెళ్లిన మోహన్ భగవత్
  • మోహన్ భగవత్ వీసా రద్దు చేయాలని అక్కడి క్రైస్తవ, ముస్లిం, సిక్కు వర్గాలు ఫిర్యాదు చేశాయన్న పాల్
  • దీనిపై అమెరికా ప్రతినిధి ఒకరు తన అభిప్రాయాన్ని కోరారని వెల్లడి

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అమెరికా పర్యటన ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్‌ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో 17 రోజుల పాటు జరగనున్న గ్లోబల్ అవుట్‌రీచ్ పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్‌కు చేరుకోవడంతో ఈ అంశం దౌత్య, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఈ పరిణామంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ అమెరికా రాకముందే ఆయన వీసాను రద్దు చేయాలంటూ అక్కడి క్రైస్తవ, ముస్లిం, సిక్కు వర్గాల సంస్థలు అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయని కేఏ పాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో వీసా రద్దు చేసే అధికారం ఉన్న అమెరికా ప్రతినిధి ఒకరు తన అభిప్రాయాన్ని కోరినట్లు వెల్లడించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మోహన్ భగవత్ పర్యటనను నిలిపివేయడం సరికాదని, ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలని తాను అమెరికా నాయకులకు స్పష్టం చేసినట్లు చెప్పారు.


మరొకవైపు, ఆగస్టు 29న న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో 'యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్' పేరిట జరగనున్న బృహత్ సభలో మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. అయితే ఈ పర్యటనపై అమెరికాలోని హక్కుల సంఘాల నుంచి నిరసనలు, మద్దతు రెండూ వ్యక్తమవుతుండటంతో ఆయన పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభ ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సోదరభావాన్ని కాపాడుతామని భగవత్ స్పష్టమైన సందేశం ఇవ్వాలని కేఏ పాల్ కోరారు.

Advertisement
Mohan Bhagwat
KA Paul
RSS US Visit
Madison Square Garden
Universal Oneness Celebrations
RSS Centenary Outreach

More Telugu News