ఏఐతో మానవ సమాజానికి భారీ ప్రమాదం పొంచి ఉంది: బిల్ గేట్స్

Bill Gates warns of huge danger to humanity from AI
  • ఏఐ పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలన్న బిల్ గేట్స్
  • కొన్ని రంగాలు మాత్రమే మానవులకు ఉపాధిని ఇవ్వగలవని అంచనా
  • ఉపాధి రంగంలో తీవ్ర సంక్షోభం రానుందని ఆందోళన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాలు గనుక త్వరితగతిన అప్రమత్తమై నిబంధనలు తీసుకురాకపోతే మానవ సమాజానికి భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.


గత సాంకేతిక విప్లవాలు ఉద్యోగ అవకాశాలను పెంచినప్పటికీ, ఏఐ విప్లవం మాత్రం అందుకు పూర్తి భిన్నమైనదని గేట్స్ స్పష్టం చేశారు. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగైపోతాయని, కేవలం కొన్ని రంగాలు మాత్రమే మానవులకు ఉపాధిని ఇవ్వగలవని తెలిపారు. ఏఐ కోడింగ్ సామర్థ్యాలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, నిపుణులైన మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తున్న ఈ సాంకేతికత వల్ల సమీప భవిష్యత్తులోనే ఉపాధి రంగంలో తీవ్ర సంక్షోభం రానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కంపెనీలు దీనివల్ల వచ్చే ముప్పును తక్కువ చేసి చూపిస్తున్నాయని, పెట్టుబడులు తగ్గిపోతాయనే భయంతో అసలు ఆందోళనలను బహిరంగంగా అంగీకరించడం లేదని విమర్శించారు.


మనుషుల ఉపాధిని కాపాడేందుకు గేట్స్ కొన్ని సంచలనాత్మక ప్రతిపాదనలు చేశారు. ఏఐ, రోబోలను ఉపయోగిస్తూ మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించే కంపెనీలపై ప్రత్యేక పన్ను (Robot / AI Tax) విధించాలని, ఆ ఆదాయంతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. అలాగే కొన్ని రంగాలను కేవలం "మనుషులకు మాత్రమే పరిమితం" (Human Reserved) చేయాలని... ఉదాహరణకు వైద్యరంగంలో రోగికి వ్యాధి వివరాలు చెప్పడం లేదా కేర్ గివింగ్ వంటి బాధ్యతలను మనుషులే నిర్వహించేలా చట్టాలు తేవాలని ప్రతిపాదించారు.


అంతేకాకుండా, జీవాస్త్రాలు లేదా కొత్త రకం రసాయన ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు ఏఐని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. అణు ఆయుధాలు, అంతర్జాతీయ విమానయానానికి ఉన్నట్లే ఏఐ వినియోగం, నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఒప్పందాలు, పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు కావాలని సూచించారు.

Advertisement
Bill Gates
Artificial Intelligence
AI Job Loss
Robot Tax
AI Regulation
Future of Humanity

More Telugu News