ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాదిక్ తల్లి సంచలన వ్యాఖ్యలు

AE Nukaraju family suicide case big twist Sadiq mother sensational comments
  • తమ కుమారుడు నిర్దోషి అంటూ మీడియా ముందుకు వచ్చిన సాదిక్ తల్లి
  • సౌజన్యనే తమ ఇంటికి వచ్చి పెళ్లి ప్రస్తావన తెచ్చిందని వెల్లడి
  • జగదీశ్ మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఆస్తుల ఆరోపణలను ఖండిస్తూ పోలీసులకు ఆధారాలు సమర్పించామన్న నూర్జహాన్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ బుధవారం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు వెల్లడించారు. తన కుమారుడి వేధింపుల వల్లే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. అసలు కథ వేరే ఉందని, సౌజన్యనే తన కుమారుడిని వివాహం చేసుకోవాలని కోరిందని ఆమె తెలిపారు.

కాకినాడ జిల్లాలో మీడియాతో మాట్లాడిన నూర్జహాన్, ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. "సౌజన్య రెండుసార్లు మా ఇంటికి వచ్చింది. సాదిక్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ మేము ఆ ప్రతిపాదనను నిరాకరించాం. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డితో వివాహం జరగకపోయి ఉంటే, సౌజన్యను సాదిక్‌కే ఇచ్చి పెళ్లి చేసేవాడ్నని నూకరాజే స్వయంగా మాతో అన్నారు" అని నూర్జహాన్ వివరించారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతితో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పైగా, ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఫోన్ చేసి పిలవగా వెళ్లిన సాదిక్‌పై జగదీశ్వర్ రెడ్డి, అతని మనుషులు దాడి చేసి, కత్తితో బెదిరించారని ఆరోపించారు.

భర్త సరిగా చూసుకోకపోవడం వల్లే సౌజన్య తన కుమారుడితో సంబంధం కొనసాగించిందని నూర్జహాన్ అన్నారు. సౌజన్య కుమారుడు రియాన్ష్.. సాదిక్‌ను ‘అబ్బు’ అని, సొంత తండ్రిని ‘ఇడియట్’ అని పిలిచేవాడని ఆమె చెప్పడం గమనార్హం. ఫోన్‌లో సాదిక్ చెప్పే కథలు వింటూ ఆ బాలుడు నిద్రపోయేవాడని తెలిపారు. సౌజన్య తమను తెలుగు ఖురాన్, బురఖా కావాలని అడిగినట్లు కూడా ఆమె వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం 5:30 గంటలకు సౌజన్య ఫోన్ చేసి రమ్మని పిలిచిందని, అయితే కేరళలో విద్యార్థుల కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండటంతో సాదిక్ తన అకాడమీకి వెళ్లాడని నూర్జహాన్ తెలిపారు. నూకరాజు కుటుంబానికి చెందిన ఆస్తులు గానీ, బంగారం గానీ తమ వద్ద లేవని, తమ బ్యాంకు పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డులను పోలీసులకు అప్పగించామని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఇటీవల రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలుడు రియాన్ష్ ఒక్కడే ఈ ఘటన నుంచి బయటపడ్డాడు. గోదావరిలో మునిగిపోతున్న అతడిని మత్స్యకారులు కాపాడారు. సాదిక్ వేధింపులు, బ్లాక్‌మెయిల్ కారణంగానే తాము చనిపోతున్నట్లు వారు రాసిన లేఖలు కలకలం రేపాయి. ఈ కేసులో పోలీసులు సాదిక్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలతో ఈ కేసుకు సరికొత్త కోణం తోడైంది.
Advertisement
AE Nukaraju
Sadiq Khan
Noorjahan
Godavari suicide case
Rifle coach Sadiq
Kakinada suicide news

More Telugu News