డెలాయిట్‌కు భారీ షాక్‌.. అమెరికా కేసులో రూ.180 కోట్ల సెటిల్‌మెంట్‌!

Deloitte faces huge shock with 180 crore settlement in US case
  • డెలాయిట్‌ 21.5 మిలియన్‌ డాలర్ల సెటిల్‌మెంట్‌
  • నియామకాల్లో జాతి, లింగాన్ని పరిగణించారన్నది ఆరోపణ
  • డెలాయిట్‌ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టీకరణ
  • సుమారు 10 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లింపు
  • విజిల్‌బ్లోయర్‌కు 4.3 మిలియన్‌ డాలర్లు
అమెరికాకు చెందిన ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ ఓ కేసు సెటిల్ మెంట్ కింద భారీ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఉద్యోగ నియామకాల్లో జాతి, లింగాన్ని పరిగణనలోకి తీసుకున్నారన్న ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ముగించేందుకు 21.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.180 కోట్లు) చెల్లించనుంది. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని డెలాయిట్‌ స్పష్టం చేసింది.

అమెరికా న్యాయశాఖ (డీఓజే) ఆరోపణల ప్రకారం.. సంస్థలో ఉద్యోగుల జాతి, లింగ నిష్పత్తికి సంబంధించి అంతర్గత లక్ష్యాలు ఉండేవి. నియామకాలు, పదోన్నతులు, ఉద్యోగుల కేటాయింపుల్లో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొన్ని విభాగాల పురోగతిని ఈ లక్ష్యాలతో పోల్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేవారని తెలిపింది.

దాదాపు రెండేళ్లపాటు 150 మంది సీనియర్‌ పార్ట్‌నర్లు, ప్రిన్సిపల్స్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ల పనితీరు ఆధారిత చెల్లింపులపై కూడా ఈ లక్ష్యాల ప్రభావం ఉండొచ్చని డీఓజే ఆరోపించింది. స్ప్రింగ్‌బోర్డ్‌, కంపాస్‌ వంటి కార్యక్రమాల్లోనూ జాతి, లింగం ఆధారంగా అర్హతలు పరిమితం చేసినట్లు పేర్కొంది.

డెలాయిట్‌ మాత్రం ఆరోపణలను అంగీకరించలేదు. సుదీర్ఘ న్యాయపోరాటంతో వచ్చే ఖర్చు, అనిశ్చితి, సంస్థకు కలిగే అంతరాయాన్ని నివారించేందుకే సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్లు తెలిపింది. ఈ ఒప్పందం తమ తప్పును అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది.

21.5 మిలియన్‌ డాలర్లలో దాదాపు 10 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించనున్నారు. మిగిలిన మొత్తం సివిల్‌ పెనాల్టీలు, వడ్డీ కోసం వెళుతుంది. సంబంధిత విజిల్‌బ్లోయర్‌ కేసు దాఖలు చేసిన అమెరికన్‌ అలయన్స్‌ ఫర్‌ ఈక్వల్‌ రైట్స్‌కు 4.3 మిలియన్‌ డాలర్లు అందనున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో కంపెనీల డీఈఐ కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెంచింది. 2025 మేలో ఫెడరల్‌ కాంట్రాక్టులకు సంబంధించిన వివక్ష ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సివిల్‌ రైట్స్‌ ఫ్రాడ్‌ ఇనీషియేటివ్‌ను ప్రారంభించింది. డెలాయిట్‌ సెటిల్‌మెంట్‌కు కొన్ని నెలల ముందు ఐబీఎం కూడా ఇలాంటి ఆరోపణలపై 17 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.
Advertisement
Deloitte
US Department of Justice
Employment Discrimination
Race and Gender Bias
Deloitte Settlement News
Civil Rights Fraud Initiative

More Telugu News