రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి సురేఖావాణి: ట్రోలింగ్, గాలి వార్తలపై ఘాటు స్పందన!
- ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు కాస్త దూరమైన సురేఖావాణి
- తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడి
- ఆ ఆలోచన ఉంటే ఇప్పటి వరకు ఆగేదాన్ని కాదన్న సురేఖ
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి సురేఖావాణి... కొంతకాలంగా తెలుగు సినిమాలకు కాస్త దూరమై తమిళ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె దర్శకుడు కృష్ణ బలరామ్ తెరకెక్కిస్తున్న ‘నిరమ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. తాన్యా హోప్, ప్రీతి అస్రాని, నితిన్ సత్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కెస్క్వేర్ సినిమాస్ నిర్మిస్తుండగా, డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సురేఖావాణి... తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రకరకాల పుకార్లకు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చారు.
రెండో పెళ్లి వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఒకవేళ ఆ ఆలోచనే ఉంటే ఇప్పటివరకు ఆగేదాన్ని కాదు కదా? ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసే వయసు వచ్చింది, ఈ దశలో నాకేంటి పెళ్లి?" అని ప్రశ్నించారు. అంతేకాకుండా "నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని మీడియానే వార్తలు రాసేసిందిగా" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
ఇక సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందిస్తూ.. "నాకు నచ్చిన ఫొటోలు, పోస్టులు నేను పెడతాను. నా జీవితం, నా ప్రాధాన్యతలు నాకే ముఖ్యం. పక్కవారు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి చాలా కాలమైంది" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారాయి.