Advertisement

ఏర్పేడు వ్యాసాశ్రమం వివాదం: వైసీపీ నేతల వ్యాఖ్యలు సరైనవి కాదన్న రాష్ట్ర సాధు పరిషత్

Yerpedu Vyasashramam controversy State Sadhu Parishad says YCP leaders comments are not correct
  • వ్యాసాశ్రమం వివాదంలో రాజకీయాల జోక్యం తగదన్న సాధు పరిషత్
  • హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్య
  • సమస్య పరిష్కారానికి త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడి

ఏర్పేడు వ్యాసాశ్రమం వివాదంలో రాజకీయాల జోక్యం తగదని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ సభ్యులు హితవు పలికారు. ఈ ఆశ్రమ వివాదంపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవికావని మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సాధు పరిషత్ ప్రతినిధులు... వ్యాసాశ్రమంలో ఏవైనా సమస్యలుంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, బహిరంగ విమర్శలతో ధర్మాన్ని కించపరచవద్దని హితవు పలికారు.


ఆశ్రమానికి చెందిన రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి అన్యాక్రాంతం చేశారంటూ పరంపర స్వామీజీ చేసిన ఆరోపణలను వారు తోసిపుచ్చారు. ఇప్పటికే పరిపూర్ణానందగిరి స్వామి ఈ ఆరోపణలపై తగిన వివరణ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ వివాదంపై చర్చించి, ఒక స్పష్టమైన పరిష్కారానికి వచ్చేందుకు త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.


ప్రాచీనమైన వ్యాసాశ్రమంలో అవినీతి జరుగుతోందంటూ దుష్ప్రచారం చేయడం వల్ల మన సనాతన ధర్మాన్ని, పవిత్రమైన ఆశ్రమ వ్యవస్థను మనమే తక్కువ చేసి చూపించినట్లవుతుందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2019 నుంచి 2024 మధ్య అనేక దేవాలయాలపై దాడులు జరిగి, ధ్వంసమైనప్పుడు లేదా "ఇది కషాయం కాదు.. కసాయ్" అంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించినప్పుడు ఈ స్వామీజీలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. నాడు కనీసం ఖండించని వారు, నేడు 40 ఏళ్లుగా ఎలాంటి అవినీతి మరకలేని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆశ్రమ స్వామీజీలు వివాదాలను పక్కనపెట్టి, కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Yerpedu Vyasashramam
State Sadhu Parishad
Paripurnananda Giri Swamy
Anam Ramanarayana Reddy
YCP leaders
Tirupati news

More Telugu News