భోగాపురం విమానాశ్రయం ఏపీకి మణిహారం: జగన్‌పై పల్లా శ్రీనివాసరావు నిప్పులు
- రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్న పల్లా
- భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి 5 లక్షల మందిని రప్పిస్తామని వెల్లడి
- ఉత్తరాంధ్రకు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు పోటెత్తుతాయని ధీమా
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక దివ్య మణిహారం లాంటిదని, ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్ గుర్తుంచుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైన వేళ, రాష్ట్రంలో జరుగుతున్న ఈ భారీ అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆటంకాలు సృష్టించే కుట్రతోనే ఆయన విశాఖ పర్యటనకు వచ్చారని ఆరోపించారు.
రాజకీయ కుతంత్రాలతో రాష్ట్ర వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేసిన పల్లా... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రగతిదాయక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోందని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును సకల జనులు వీక్షించేలా గాజువాక నుంచి 125, జిల్లావ్యాప్తంగా 5 వేల బస్సులను ఏర్పాటు చేసి దాదాపు 5 లక్షల మంది ప్రజలకు భోగాపురం ఎయిర్‌పోర్టును దర్శించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
గతంలో బెంగళూరు, చెన్నై నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుతో పారిశ్రామిక విప్లవం ఏ విధంగా సాధ్యమైందో, భోగాపురం రాకతో ఉత్తరాంధ్రలోనూ అదే తరహాలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు పోటెత్తుతాయని పల్లా ధీమా వ్యక్తం చేశారు. విదేశీ వ్యాపారవేత్తలు, బహుళజాతి సంస్థలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తాయని చెప్పారు. ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం 'స్వర్ణాంధ్ర'గా మారి రూపురేఖలు మార్చుకుంటుందని, ఉపాధి కోసం స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం ఇకపై ఉండదని పల్లా స్పష్టం చేశారు.