Advertisement

భారతీయ యువతి, అమెరికన్ సైనికుడు.. వారి వీడియో ఎందుకు ట్రెండ్ అవుతోందంటే?

Indian woman and American soldier viral video explained
  • అమెరికా సైనికుడిని పెళ్లాడిన భారత యువతి వీడియో నెట్టింట‌ వైరల్
  • కేవలం రూ.13,000 ఖర్చుతో ఇల్లు కొనుగోలు చేశామని వెల్లడి
  • ఇది ప్రభుత్వ ప్రత్యేక గృహ రుణ పథకంలో భాగమని స్పష్టీక‌ర‌ణ‌
  • సైనికుల కుటుంబాలకు విద్య, వైద్య సాయం కూడా లభిస్తుందని వివరణ
  • ఈ జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ 'పతి దేవ్' అంటూ కామెంట్లు
అమెరికా సైనికుడిని వివాహం చేసుకున్న ఓ భారతీయ యువతి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట‌ సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో సైనిక కుటుంబాలకు అందే ప్రయోజనాలను వివరిస్తూ, తాము కేవలం రూ.13,000 ఖర్చుతోనే ఒక ఇల్లు కొనుగోలు చేశామని చెప్పడంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మేఘా అనే భారతీయ యువతి యూఎస్ ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్న మిచెల్ లేలాండ్ హిల్‌ను వివాహం చేసుకున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (@meghamitch) తన భర్తతో కలిసి ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో అమెరికాలో సైనికుల కుటుంబాలకు అందే మూడు ముఖ్యమైన ప్రయోజనాల గురించి వారు వివరించారు. చదువు కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం, సైనిక కుటుంబాలకు అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు ఇందులో ఉన్నాయని మిచెల్ తెలిపారు.

అయితే, అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఇల్లు కొనుగోలుకు సంబంధించినది. తాము ఇల్లు కొనేటప్పుడు కేవలం 140 డాలర్లు మాత్రమే పేపర్‌వర్క్ కోసం ఖర్చు చేశామని, ఆ తర్వాత ఇంటి తాళాలు చేతికిచ్చారని మిచెల్ చెప్పారు. ఈ మొత్తాన్ని మేఘా తన భారతీయ ఫాలోవర్ల కోసం మన కరెన్సీలోకి మార్చి, అది సుమారు రూ.13,000 అవుతుందని వివరించారు. ఇంత తక్కువ మొత్తానికే ఇల్లు ఎలా సాధ్యమైందని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు.

వాస్తవానికి ఇది అమెరికాలో సైనికులు, మాజీ సైనికుల కోసం ప్రభుత్వం అందించే ఓ ప్రత్యేక సౌకర్యం. 'వీఏ-బ్యాక్డ్ హోమ్ లోన్స్' వంటి పథకాల ద్వారా అర్హులైన సైనిక సిబ్బందికి సున్నా లేదా చాలా తక్కువ డౌన్ పేమెంట్‌తో గృహ రుణాలు అందిస్తారు. అయితే, ఈ ప్రయోజనాలు అందరికీ ఒకేలా వర్తించవు. ప్రాంతం, ఇంటి రకం, ఇతర క్లోజింగ్ ఖర్చులను బట్టి చెల్లించాల్సిన మొత్తం మారుతుంది. మేఘా దంపతుల అనుభవం ఆ పథకం ద్వారా లభించిన ఒకానొక ప్రయోజనం మాత్రమే.

ఈ వీడియోలో ప్రయోజనాల గురించే కాకుండా ఈ జంట మధ్య ఉన్న అనుబంధంపై కూడా అనేక కామెంట్లు వచ్చాయి. చాలా మంది వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి ప్రేమకథను అభినందించారు. కొందరైతే మిచెల్‌ను 'పతి దేవ్' అని అభివర్ణిస్తూ, తమకు కూడా అలాంటి భాగస్వామి దొరకాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ పోస్ట్, అమెరికాలో సైనిక కుటుంబాలకు అందే మద్దతుపై ఆసక్తిని రేకెత్తిస్తూ సోషల్ మీడియాలో తెగ‌ చక్కర్లు కొడుతోంది.
Advertisement
Megha
Mitchell Leland Hill
US Army benefits
VA home loans
Indian woman US soldier marriage
Viral Instagram video

More Telugu News