Advertisement

రూ.3 లక్షలతో రూ.2.4 కోట్ల బిజినెస్‌.. ఇద్దరు ఫ్రెండ్స్‌ కాఫీ షాప్‌ సక్సెస్‌ స్టోరీ

Koffee Kaafi founders Vaibhav Arora and Vansh Mor share their startup journey
  • రూ.3 లక్షలతో ‘కోఫీ కాఫీ’ ప్రారంభం
  • తొలి నెలలోనే పెట్టుబడి రికవరీ
  • ప్రస్తుతం ఢిల్లీలో ఐదు ఔట్‌లెట్లు
  • నెలకు రూ.20 లక్షల ఆదాయం
  • మరిన్ని ఔట్‌లెట్లతో విస్తరణ లక్ష్యం
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితేనే వ్యాపారంలో విజయం సాధిస్తారనేది అపోహ అని ఢిల్లీకి చెందిన ఇద్దరు యువకులు నిరూపించారు. కేవలం రూ.3 లక్షలతో ప్రారంభించిన చిన్న కాఫీ కార్ట్‌ను ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా తీర్చిదిద్దారు. అందుబాటు ధరలో మంచి కాఫీ అందించాలనే ఆలోచనే వారి విజయానికి పునాది అయింది.

ఢిల్లీకి చెందిన వైభవ్‌ అరోరా, వంశ్‌ మోరే చిన్ననాటి స్నేహితులు. ప్రీమియం కేఫ్‌లలో రూ.300 నుంచి రూ.400 ఖర్చు చేసి కాఫీ తాగడం భారంగా మారడంతో, తక్కువ ధరలో నాణ్యమైన కాఫీ అందించాలని నిర్ణయించారు. 2023 జూన్‌ 11న ఢిల్లీలోని రోహిణిలో ‘కోఫీ కాఫీ’ పేరుతో కాఫీ కార్ట్‌ను రూ.3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. ఖరీదైన ఎస్‌ప్రెస్సో యంత్రాల బదులు సాధారణ కాఫీ యంత్రాలు ఉపయోగిస్తూ రూ.50 నుంచి రూ.85కే కాఫీ విక్రయించారు.

వ్యాపారం ప్రారంభించిన తొలి నెలలోనే రూ.3 నుంచి రూ.3.5 లక్షల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో పెట్టిన పెట్టుబడి వెంటనే తిరిగొచ్చింది. ఆ తర్వాత కమలా నగర్‌లో తొలి పర్మినెంట్ స్టోర్‌ను ప్రారంభించారు. తాజాగా ఢిల్లీలో ఐదు ఔట్‌లెట్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరో బ్రాంచ్‌ను పంజాబీ బాగ్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పెద్ద కేఫ్‌లకు బదులుగా చిన్న ‘గ్రాబ్‌ అండ్‌ గో’ స్టోర్లను ఎంచుకోవడం వీరి ప్రత్యేకత. దీంతో అద్దె ఖర్చు తగ్గి కాఫీని తక్కువ ధరలో విక్రయించే అవకాశం లభించింది. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.160 వరకు కాఫీ అందిస్తున్నారు. రోజుకు వెయ్యి నుంచి 1,500 మంది కస్టమర్లు వస్తున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఐదు లక్షల కప్పులకు పైగా కాఫీ విక్రయించారు.

ప్రస్తుతం ‘కోఫీ కాఫీ’కి నెలకు సుమారు రూ.20 లక్షల ఆదాయం వస్తోంది. ఏడాదికి దాదాపు రూ.2.4 కోట్ల టర్నోవర్‌ నమోదు చేస్తోంది. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక ఔట్‌లెట్‌ ఏర్పాటు చేయాలన్నదే తమ తదుపరి లక్ష్యమని వ్యవస్థాపకులు చెబుతున్నారు. యువతకు అందుబాటు ధరలో నాణ్యమైన కాఫీ అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
Advertisement
Koffee Kaafi
Vaibhav Arora and Vansh Mor
Delhi coffee shop success story
Low investment business ideas
Entrepreneurship success stories India
Koffee Kaafi startup turnover

More Telugu News