సునీల్ రెడ్డి.. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ కోలీవుడ్‌లో బిజీగా మారారు. ఈయన మరెవరో కాదు, ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన స్టార్ డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి తనయుడే. ఇటీవల సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న సునీల్ రెడ్డి, ఇప్పుడు మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఆయన ‘లవ్ ఇంక్’ అనే తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. రాజ్ అయ్యప్ప, డెల్నా డేవిస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మేఘరాజ్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైలో చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్‌లో సునీల్ రెడ్డి జాయిన్ అయ్యారు. సమకాలీన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కోదండరామిరెడ్డి పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు గుర్తుకొస్తాయి. ‘ఖైదీ’, ‘అభిలాష’, ‘పసివాడి ప్రాణం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘ముఠామేస్త్రి’ వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన 20కి పైగా చిత్రాల్లో 90 శాతం విజయవంతం కావడం ఓ రికార్డు. అంతటి గొప్ప దర్శకుడి వారసుడిగా సునీల్ రెడ్డి.. 2018లో విజయ్ సేతుపతి నటించిన ‘సీతకత్తి’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘డాక్టర్’, ‘బీస్ట్’, ‘జైలర్’, ‘మామన్నన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగులోనూ బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ వంటి సినిమాల్లో కనిపించారు.

ఇక సునీల్ రెడ్డి సోదరుడు వైభవ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘గొడవ’ చిత్రంతో హీరోగా పరిచయమైన వైభవ్.. ‘సరోజ’, ‘గోవా’, ‘కస్టడీ’ వంటి అనేక చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన కూడా నటుడిగా బిజీగా ఉన్నారు. ఇలా కోదండరామిరెడ్డి ఇద్దరు కుమారులు నటనారంగంలోనే తమదైన శైలిలో రాణిస్తుండటం విశేషం.