న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లు), మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (65; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబడటంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులకే పరిమితమైంది. దీంతో కివీస్‌ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 3-1కి తగ్గింది.

టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే న్యూజిలాండ్‌ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఫిన్‌ అలెన్‌ (31; 17 బంతుల్లో) వేగంగా పరుగులు రాబట్టగా, డారిల్‌ మిచెల్‌ 9 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫిలిప్స్‌ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి వేసిన 16వ ఓవర్‌లో ఫిలిప్స్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. నోబాల్‌తో కలిపి ఆ ఓవర్‌లో 32 పరుగులు వచ్చాయి. బ్రేస్‌వెల్‌ కూడా ధాటిగా ఆడటంతో ఐదో వికెట్‌కు వీరిద్దరూ కేవలం 40 బంతుల్లోనే 115 పరుగులు జోడించారు. ఫిలిప్స్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రేస్‌వెల్‌ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

260 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. సంజూ శాంసన్‌ రెండు బంతులకే, ఇషాన్‌ కిషన్‌ మూడు బంతులకే పెవిలియన్‌ చేరారు. అభిషేక్‌ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (22) కొద్దిసేపు పోరాడినా భారీ భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. నితీశ్‌ రెడ్డి 10 బంతుల్లో 21 పరుగులు చేసి దూకుడు చూపించాడు. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత్‌ 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో తిలక్‌ వర్మ (35; 35 బంతుల్లో), నమన్‌ ధీర్‌ (28; 13 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. నమన్‌ ధీర్‌ ఔటైన తర్వాత భారత పోరాటం మరింత బలహీనపడింది. తిలక్‌ వర్మ కూడా 19వ ఓవర్‌లో వెనుదిరగడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ నాలుగు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. మ్యాట్‌ ఫిషర్‌, మిచెల్‌ శాంట్నర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నిజానికి న్యూజిలాండ్‌ ఫీల్డర్లు పలు క్యాచ్‌లను జార విడిచారు. లేదంటే భారత్‌ ఇంకాస్త ముందే ఓటమిని చవిచూసేది. అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిలిప్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.