మెరుగైన జీతం, ప్రపంచ స్థాయి జీవనశైలి, కెరీర్‌లో వేగంగా ఎదగాలనే లక్ష్యంతో వేలాది మంది భారతీయులు విదేశాల వైపు చూస్తున్నారు. అయితే ఉద్యోగం దొరికినా వీసా ప్రక్రియ చాలామందికి పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి వారికి 2026లో కొన్ని దేశాలు సులభమైన వర్క్‌ వీసా విధానాలతో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగ అవకాశం, నైపుణ్యాలు ఉంటే తక్కువ ఇబ్బందులతో వీసా పొందే వీలున్న ఆరు దేశాల వివరాలు ఇవే..

జర్మనీ
భారతీయ నిపుణులకు జర్మనీ ఇప్పటికీ అత్యంత అనుకూల గమ్యస్థానాల్లో ఒకటి. జర్మన్‌ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం ఉంటే వర్క్‌ వీసా పొందడం సులభం. ఉద్యోగం లేని వారికి కూడా ఆపర్చునిటీ కార్డ్‌ (Chancekarte) ద్వారా అక్కడికి వెళ్లి ఉద్యోగం వెతుక్కునే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా వీసా ప్రక్రియ 15 పని దినాల్లో పూర్తవుతుంది.

ఆస్ట్రేలియా
ఉద్యోగం కోసం భారతీయులు అధికంగా ఆశ్రయిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. విద్యార్హతలు, అనుభవం, ఇంగ్లిష్‌ ప్రావీణ్యం ఆధారంగా పాయింట్ల విధానంలో వీసాలు ఇస్తారు. స్కిల్డ్‌ ఇండిపెండెంట్‌, స్కిల్డ్‌ నామినేటెడ్‌, ఎంప్లాయర్‌ నామినేషన్‌ వంటి పలు వీసా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీసా రకాన్ని బట్టి ప్రాసెసింగ్‌కు కొన్ని నెలల నుంచి ఏడాది వరకు పట్టే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌
న్యూజిలాండ్‌లో గుర్తింపు పొందిన యజమాని నుంచి ఉద్యోగ అవకాశం ఉంటే వర్క్‌ వీసా పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండి మంచి నడవడికతో పాటు ఇతర అవసరమైన అర్హతలు తప్పనిసరి. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశం ఉంది. అక్రెడిటెడ్‌ ఎంప్లాయర్‌ వర్క్‌ వీసా దాదాపు 20 నుంచి 44 రోజుల్లో జారీ అవుతుంది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
యూఏఈ వర్క్‌ వీసా ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఉద్యోగం ఇచ్చే సంస్థే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తుంది. గతంలో 15 దశల్లో జరిగే ప్రక్రియను ఇప్పుడు ఐదు దశలకు కుదించారు. దాదాపు ఐదు పని దినాల్లోనే వీసా ప్రక్రియ పూర్తయ్యేలా కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

నెదర్లాండ్స్‌
టెక్నాలజీ, ఫైనాన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో పనిచేసే భారతీయులకు నెదర్లాండ్స్‌ మంచి అవకాశాలు అందిస్తోంది. ఉద్యోగ అవకాశంతో పాటు నిర్ణయించిన కనీస వేతన ప్రమాణాలు ఉండాలి. హైలీ స్కిల్డ్‌ మైగ్రెంట్‌, ఈయూ బ్లూ కార్డ్‌ వంటి వీసాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. చాలా దరఖాస్తులు రెండు నుంచి ఐదు వారాల్లోనే పూర్తవుతాయి.

సింగపూర్‌
ఆసియాలో ఉద్యోగాలకు కేంద్రంగా సింగపూర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫైనాన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌ రంగాల నిపుణులకు ఇక్కడ డిమాండ్‌ ఎక్కువ. ఎంప్లాయ్‌మెంట్‌ పాస్‌, ఎస్‌ పాస్‌ వంటి వీసాలకు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తుంటారు. జాబ్‌ ఆఫర్‌ వచ్చిన తర్వాత యజమానే ఆన్‌లైన్‌లో వీసా ప్రక్రియను పూర్తి చేస్తారు.