‘ఆదర్శ కుటుంబం’లో నివేదా పేతురాజ్.. స్పెషల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

Nivetha Pethuraj joins Victory Venkatesh and Trivikram Srinivas movie Adarsha Kutumbam
  • ఆకట్టుకుంటున్న వెంకటేశ్‌ కామెడీ డైలాగ్‌లు
  • సత్య ఎంట్రీతో సరదాగా ముగిసిన వీడియో
  • వెంకటేష్ 77వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా
  • అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

మొదట నివేదా పేతురాజ్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం చేశారు. వీడియోలో వెంకటేశ్‌ సరదా డైలాగ్‌లతో ఆకట్టుకోగా, నివేదా చిరునవ్వుతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

గ్లింప్స్‌లో వెంకటేశ్‌ ఇంటి నుంచి కోపంగా బయటకు వచ్చి, నేటి మహిళలపై సరదాగా వ్యాఖ్యలు చేస్తారు. అదే సమయంలో ఎదురుగా నివేదా పేతురాజ్ నవ్వుతూ కనిపించడంతో, ‘‘ఆడది అంటే ఇలా నవ్వాలి’’ అంటూ తన భార్య గురించి వెంకటేశ్‌ చెప్పే కామెడీ డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. చివర్లో కమెడియన్ సత్య వచ్చి ‘‘ఊరుకో నాయనా.. ఇది మన ఆదర్శ కుటుంబం’’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది.

ఈ చిత్రంలో శ్రీనిధి స్వర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్‌ను బట్టి చూస్తే నివేదా పేతురాజ్ పాత్రకు కూడా కథలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్‌ కెరీర్‌లో ఇది 77వ చిత్రం కాగా, నారా రోహిత్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Advertisement
Nivetha Pethuraj
Venkatesh
Adarsha Kutumbam
Trivikram Srinivas
Adarsha Kutumbam Glimpse
Telugu Cinema

More Telugu News