భారతీయ సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం. బెంగుళూరులో ఒక సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తున్న ఆయన జీవిత కథ త్వరలో సినిమాగా రానుందనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. కొంతకాలంగా రజినీకాంత్ తన ఆత్మకథ (ఆటోబయోగ్రఫీ) రాస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు దానిని బయోపిక్‌గా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని కొత్త నివేదికలు వెల్లడిస్తున్నాయి.

తాజా మీడియా కథనాల ప్రకారం.. రజనీకాంత్ తన ఆత్మకథను సినిమాగా మార్చే విషయంపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆత్మకథలో ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, వృత్తిపరమైన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, మరపురాని క్షణాలను సమగ్రంగా పొందుపరచనున్నారని సమాచారం. ఈ పుస్తకాన్ని బయోపిక్‌గా తీస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు జరుగుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో జోరుగా ప్రచారంలో ఉంది.

గతంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్య కూడా తన తండ్రి ఆత్మకథ రాస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు. "కష్టపడి తనకంటూ ఒక మార్గాన్ని సృష్టించుకున్న మా తలైవా, బెంగుళూరులో బస్ కండక్టర్‌గా తన పోరాటాల నుంచి కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగే వరకు తన జీవిత చరిత్రను రాయడం ప్రారంభించారు" అని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పుస్తకం ఆయన జీవితం, కెరీర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని సౌందర్య విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో రజనీకాంత్ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ధర్మాన్’ అనే మరో చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు.