Advertisement

రెండో రోజే 50 శాతం పడిపోయిన జన నాయగన్‌ కలెక్షన్లు

Vijay Jana Nayagan day 2 box office collection report
  • తొలి రోజు రూ.42.70 కోట్ల నెట్‌ వసూళ్లు
  • రెండో రోజు నెట్‌ వసూళ్లు రూ.21.15 కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా రూ.112.50 కోట్ల గ్రాస్
  • వీకెండ్‌పై ట్రేడ్ వర్గాల ఆశలు
తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ.. రెండో రోజే వసూళ్లు గణనీయంగా తగ్గాయి. సాక్‌నిల్క్ అంచనాల ప్రకారం.. తొలి రోజు ఈ చిత్రం రూ.42.70 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రూ.21.15 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. అంటే కలెక్షన్లు 50.5 శాతం తగ్గినట్లు అంచనా. దీంతో రెండు రోజుల్లో దేశీయ నెట్ కలెక్షన్లు రూ.63.85 కోట్లకు చేరాయి.

ప్రపంచవ్యాప్తంగా సినిమా రెండు రోజుల్లో రూ.112.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇందులో భారత్ నుంచి రూ.75 కోట్ల గ్రాస్, విదేశాల నుంచి రూ.37.5 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. రెండో రోజు ఓవర్సీస్‌లో రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.

ఈ చిత్రానికి తమిళ వెర్షనే ప్రధాన బలం. రెండో రోజు తమిళంలో రూ.17.95 కోట్ల నెట్ రాగా, హిందీలో రూ.1.85 కోట్లు, తెలుగులో రూ.1.35 కోట్లు వచ్చాయి. తమిళనాడులోనే అత్యధికంగా రూ.15 కోట్ల గ్రాస్ వసూలు కాగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, కేరళ నుంచి కూడా మంచి వసూళ్లు నమోదయ్యాయి.

అయితే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయినప్పటికీ విజయ్‌కున్న స్టార్‌డమ్‌తో తొలి వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రెండో రోజే కలెక్షన్లు సగానికి పైగా పడిపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Vijay
Jana Nayagan
Box Office Collection
Jana Nayagan Day 2 Collections
Tamil Cinema
Thalapathy Vijay Last Movie

More Telugu News