మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' ప్రమోషన్లలో భాగంగా రాయలసీమ వంటకాల రుచి చూశారు. చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన పలు రకాల సీమ వంటకాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమా ప్రమోషన్ కోసం ఫుడ్ వ్లాగర్‌ (street byte) తో కలిసి వరుణ్ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో త్వరలో విడుదల కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

వరుణ్ తేజ్ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇటీవల కాలికి గాయమైనప్పటికీ, వరుణ్ తేజ్ చేతి కర్ర సాయంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై తనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారు.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. వినూత్న ప్రచార కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన ఈ సినిమా టీజర్ తో పాటు సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.