Advertisement

గోవిందా, కరిష్మా.. తెర వెనుక ఆసక్తికర బంధం ఇదే!

Govinda Karisma This is the interesting bond behind the scenes
  • షూటింగ్స్ లో కరిష్మాకు తాను రక్షణగా ఉండేవాడినని చెప్పిన గోవిందా
  • చిన్నప్పటి నుంచే తాను గోవిందాకు పెద్ద అభిమానినన్న‌ కరిష్మా
  • గోవిందా నైట్ షోకి వెళ్లి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్న సంఘటన గుర్తుచేసుకున్న నటి
  • కరిష్మా చాలా అమాయకురాలని, 1940ల నాటి హీరోయిన్ లా ఉండేదన్న‌ గోవిందా 
  • ‘రాజా బాబు’ షూటింగ్ లో వాటర్ ట్యాంక్ పై నిల్చోడానికి కరిష్మా భయపడిందని వెల్లడి
బాలీవుడ్ తెరపై 90వ దశకంలో అత్యంత విజయవంతమైన జంటల్లో గోవిందా, కరిష్మా కపూర్ జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, తెర వెనుక వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి, షూటింగ్ నాటి జ్ఞాపకాల గురించి గోవిందా తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పని కంటే ఎక్కువగా కరిష్మాకు రక్షణగా ఉండటానికే తాను ప్రాధాన్యత ఇచ్చేవాడినని ఆయన వెల్లడించారు.

ఓ ప్రముఖ టాక్ షోలో పాల్గొన్న గోవిందా, కరిష్మాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె క్రమశిక్షణ, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. "లోలో (కరిష్మా ముద్దు పేరు) చాలా సింపుల్, అమాయకురాలు. 1940ల నాటి హీరోయిన్ల లాగా నేరుగా షూటింగ్‌కు వచ్చేది. షూటింగ్ సమయంలో పని చేయడం కంటే ఎక్కువగా, నేను లోలోను కాపాడుతూనే ఉన్నాను. ఎప్పుడూ ఆమెకు రక్షణగా నిలిచాను" అని గోవిందా అన్నారు. తాను కలిసి పనిచేసిన నటీమణులలో కరిష్మా అత్యంత నిజాయతీపరురాలని ఆయన కొనియాడారు.

గోవిందా మాటలను కరిష్మా కూడా ధ్రువీకరించారు. "ఆయన ఎప్పుడూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు" అని ఆమె తెలిపారు. అంతేకాదు తాను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే గోవిందాకు వీరాభిమానినని ఆమె గుర్తుచేసుకున్నారు. ఒక పాత సంఘటనను గుర్తుచేస్తూ.. "నాకు 12-13 ఏళ్లు ఉన్నప్పుడు 'గోవిందా నైట్' అనే షో గురించి పేపర్‌లో చదివాను. ఆ షోకి ఎలాగైనా వెళ్లాలని, టికెట్లు తీసుకురావాలని మా అమ్మానాన్నలతో గొడవపడ్డాను. ఆ షోకి వెళ్లడం నా జీవితంలో గొప్ప క్షణం. షో తర్వాత బ్యాక్‌స్టేజ్‌కి వెళ్లి ఆయన్ను కలిసి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను" అని కరిష్మా ఆనందంగా చెప్పారు.

ఇదే సమయంలో 'రాజా బాబు' సినిమా షూటింగ్ నాటి ఓ సంఘటనను గోవిందా గుర్తుచేసుకున్నారు. ఒక సన్నివేశంలో భాగంగా కరిష్మా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాల్సి వచ్చిందని, ఎత్తు చూసి ఆమె చాలా భయపడిపోయిందని తెలిపారు. ఆ భయంతో ఆమె డైలాగులను కూడా వేర్వేరు స్వరాల్లో చెప్పిందని ఆయన నవ్వుతూ చెప్పారు. కాగా, వీరిద్దరూ కలిసి ‘రాజా బాబు’, ‘కూలీ నెం.1’, ‘హీరో నెం.1’, ‘హసీనా మాన్ జాయేగీ’, ‘సాజన్ చలే ససురాల్’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆ తరం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Advertisement
Govinda
Karisma Kapoor
Bollywood 90s actors
Raja Babu movie
Coolie No 1
Govinda and Karisma bond

More Telugu News