Advertisement

చిన్న సినిమాల్లోనే దమ్ముంటుంది: ‘కర్మాఖ్య’ ఈవెంట్‌లో విజయశాంతి

Vijayashanti says small films have real strength
  • వినూత్న కథలతో వచ్చే చిన్న సినిమాలకు ప్రోత్సాహం కావాలన్న విజయశాంతి
  • చిన్న సినిమాలకు మీడియా సహకారం అవసరమని వ్యాఖ్య
  • రాజకీయాల్లో బిజీ వల్ల తనకు నటించే ఆలోచన లేదని వెల్లడి

కొత్త ఆలోచనలు, వినూత్న కథలతో వచ్చే చిన్న సినిమాలకు ప్రేక్షకులు, మీడియా నుంచి మరింత ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. అలాంటి చిత్రాలకు సరైన గుర్తింపు దక్కితే తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ‘అదిరే అభి’ (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ వేడుకలో విజయశాంతి మాట్లాడుతూ... "పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు లభించే మద్దతు కాస్త తక్కువే అయినప్పటికీ, నిజమైన దమ్ము, కొత్తదనం, బలమైన కథలు చిన్న సినిమాల్లోనే ఉంటాయి. ప్రేక్షకులు ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలను ఆదరిస్తే పరిశ్రమకు మరింత మంది కొత్త నటీనటులు, దర్శకులు వస్తారు. ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలు నిలదొక్కుకోవాలంటే మీడియా సహకారం చాలా అవసరం. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో మీడియానే కీలక పాత్ర పోషిస్తుంది" అని పేర్కొన్నారు.


'కర్మాఖ్య' సినిమాలో నటించిన అభినయ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... ఈ పాత్ర కోసం ఆమె గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదని, కానీ కథపై ఉన్న అంకితభావంతోనే అలా చేశారని విజయశాంతి అభినందించారు. ఆమె పడిన కష్టానికి ప్రేక్షకులు కచ్చితంగా పెద్ద విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. 


ఇక తన నటన కెరీర్ పై స్పందిస్తూ... ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నందున నటించే ఆలోచన లేదని... అయితే బలమైన కథ, గుర్తుండిపోయే మంచి పాత్ర వస్తే మాత్రం ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా, ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ‘కర్మాఖ్య’ చిత్రం జూలై 31న థియేటర్లలోకి రానుంది.

Advertisement
Vijayashanti
Karmakhya
Adire Abhi
Abhinaya
Telugu Cinema
Trailer Launch

More Telugu News