బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా.. కారణం ఇదే: సత్యశ్రీ
- జబర్దస్త్ షో ద్వారా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సత్యశ్రీ
- బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందనేది నిజమేనని వెల్లడి
- కుటుంబం కోసం అవకాశాన్ని వదులుకున్నానన్న సత్యశ్రీ
బుల్లితెరపై పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా గుర్తింపును సంపాదించుకున్న నటి సత్యశ్రీ. ముఖ్యంగా చమ్మక్ చంద్ర టీమ్‌లో సుదీర్ఘకాలం అలరించిన ఆమె, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే వెండితెరపైనా వరుస అవకాశాలు దక్కించుకుంటూ నటిగా ముందుకు సాగుతోంది. అయితే గత కొంతకాలంగా ఆమె బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌బాస్'లోకి ఎంట్రీ ఇవ్వబోతోందంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీ ఈ ప్రచారంపై స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది. తనకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చిందనేది వాస్తవమేనని, ఆఫర్ వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఆ క్రేజీ అవకాశాన్ని తాను ఒప్పుకోలేకపోయానని తెలిపింది. తనపై కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని, ఇంటి బయట తాను చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను వదిలి సుదీర్ఘకాలం దూరంగా ఉండటం తన వల్ల కాదని, అందుకే బిగ్‌బాస్ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ తన కెరీర్‌ను బిజీగా గడిపేస్తోంది.