టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట విషాదం
- మెహర్ రమేశ్ చిన్నక్క జ్యోతి కన్నుమూత
- చిన్న తనం నుంచి తనను ఒక తల్లిలా ఆదరించిందన్న మెహర్ రమేశ్
- అక్క లేదనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆవేదన
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర విజయవాడలో కన్నుమూశారు. గత రెండు వారాలుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియా వ్యాధితో పోరాడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదకరమైన వార్తను తాజాగా మెహర్ రమేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ తీవ్రంగా కలత చెందారు.
చిన్నతనం నుంచి ఒక తల్లిలా తనను ఆదరించి, జీవితంలోని ప్రతి అడుగులో ప్రోత్సహించిన అక్క ఇక లేదనే నిజాన్ని కుటుంబం తట్టుకోలేకపోతోందని ఆవేదన చెందారు. ఇటీవలే తిరుమలలో కుటుంబమంతా కలిసి వేడుకలు జరుపుకున్న క్షణాలను, కూతురి పెళ్లిని ఆమె దగ్గరుండి జరిపించిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆత్మీయ అనుబంధం ఉన్న సోదరి హఠాన్మరణం చెందడంతో మెహర్ రమేశ్ కుటుంబానికి సినీ లోకంతో పాటు అభిమానులు తమ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.