ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలపై ప్రేక్షకులకు ఉండే ఆసక్తి అసాధారణమైనది. ఆయన తాజా చిత్రం 'ది ఒడిస్సీ'ని అత్యుత్తమ దృశ్యానుభూతితో వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు భారీగా తరలివస్తున్నారు.

నోలన్ తన చిత్రాలను అద్భుతమైన విజువల్స్, సంక్లిష్టమైన కథనంతో భారీ ఫార్మాట్‌లో రూపొందిస్తుంటారు. ముఖ్యంగా 70ఎంఎం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఆయన సినిమాలను తిలకించడం ఒక ప్రత్యేక అనుభూతిగా సినీ ప్రియులు భావిస్తారు. ఈ అరుదైన అనుభవం కోసమే కొందరు 'సూపర్ ఫ్యాన్స్' వేల కిలోమీటర్లు ప్రయాణించి మెల్‌బోర్న్‌కు చేరుకుంటున్నారు.

ఇక్కడి ఐమ్యాక్స్ థియేటర్‌లోని ప్రొజెక్టర్ గదిని పరిశీలిస్తే, టైమ్ మెషీన్‌లో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లి ఏదో అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ థియేటర్‌లో 'ది ఒడిస్సీ' చిత్రాన్ని డిజిటల్ విధానంలో కాకుండా, అసలైన 70ఎంఎం ఐమ్యాక్స్ ఫార్మాట్ ఫిలిం ప్రొజెక్టర్‌తో ప్రదర్శిస్తుండటం విశేషం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థియేటర్‌లు కేవలం 41 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 26 అమెరికాలో ఉండగా, యూకేలో 3, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఒకటి ఉంది. మిగిలినవి కెనడా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి సాంకేతికత కలిగిన థియేటర్ ఇప్పటికీ అందుబాటులో లేదు.

ఐమ్యాక్స్ థియేటర్లకు పంపిన 'ది ఒడిస్సీ' చిత్రం ఫిలిం రీల్ బరువు సుమారు 384 కిలోలు ఉంటుందని సమాచారం. ఒక్కో ప్రింట్‌లోని ఫిజికల్ ఫిలిం పొడవు ఏకంగా 6.4 లక్షల మీటర్లు ఉంటుంది. ఇంత భారీ ఫిలింను ప్రొజెక్టర్లలో లోడ్ చేయడం ఆపరేటర్లకు ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఈ లోడింగ్ ప్రక్రియలోని క్లిష్టతను ప్రేక్షకులకు వివరించేందుకు ఒక వీడియోను రూపొందించి ఆన్ లైన్‌లో విడుదల చేశారు.