17 రోజుల పాటు పిల్ల కళేబరాన్ని మోసిన తల్లి తిమింగలం.. ప్రపంచాన్ని కదిలించిన మాతృత్వం

Mother whale carried dead calf for 17 days a story of motherhood that moved the world
  • 2018లో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా తీరంలో ఘటన
  • ఇది ‘తాహ్లెక్వా (జే35)’ అనే ఆడ ఓర్కా తిమింగల విషాద యాత్ర
  • పుట్టిన అరగంటకే చనిపోయిన పిల్ల ఓర్కా
  • 1600 కిలోమీటర్లు మోసుకెళ్లిన తాహ్లెక్వా
  • ఓర్కాలకూ భావోద్వేగాలకు సంబంధించిన హార్మోన్లు ఉంటాయని శాస్త్రవేత్తల వెల్లడి
మనుషులకే కాదు.. జంతువులకూ భావోద్వేగాలు ఉంటాయని నిరూపించిన ఘటన ఇది. 2018లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా తీరంలో నివసించే ‘తాహ్లెక్వా (జే35)’ అనే ఆడ ఓర్కా (కిల్లర్ వేల్) పుట్టిన అరగంటకే చనిపోయిన తన పిల్లను వదిలిపెట్టకుండా 17 రోజుల పాటు సముద్రంలో 1,600 కిలోమీటర్లకు పైగా మోసుకెళ్లింది. ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులను కలచివేసింది.

పిల్ల కళేబరాన్ని తన తల, ముక్కుపై మోస్తూ నీటి పైభాగంలో ఉంచేందుకు తాహ్లెక్వా నిరంతరం ప్రయత్నించింది. మధ్యలో అది నీటిలో మునిగిపోతే మళ్లీ లోతుకు వెళ్లి తీసుకొచ్చేది. ఈ ప్రవర్తనను శాస్త్రవేత్తలు ‘టూర్ ఆఫ్ గ్రీఫ్’ (విషాద యాత్ర)గా అభివర్ణించారు. పిల్ల బరువు వల్ల తాహ్లెక్వా తీవ్రంగా అలసిపోయినా, ఇతర ఓర్కాలు కూడా కొంతసేపు ఆ మృతదేహాన్ని మోసి దానికి తోడుగా నిలిచాయని పరిశోధకులు వెల్లడించారు.

మొదట దీన్ని సాధారణ ప్రవర్తనగా భావించిన శాస్త్రవేత్తలు, తాహ్లెక్వా తర్వాత కూడా ఇలాంటి ప్రవర్తనను ప్రదర్శించడంతో ఇది నిజమైన దుఃఖం, మాతృవేదనే అని అభిప్రాయపడ్డారు. మనుషులకు ఉన్నట్లే ఓర్కాలకు కూడా భావోద్వేగాలకు సంబంధించిన హార్మోన్లు, న్యూరోట్రాన్స్‌మిటర్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా తాహ్లెక్వా చెందిన సదర్న్ రెసిడెంట్ కిల్లర్ వేల్ జాతి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. ప్రధాన ఆహారమైన చినుక్ సాల్మన్ చేపల సంఖ్య తగ్గడం, కాలుష్యం కారణంగా ఈ జాతిలో దాదాపు 70 శాతం గర్భాలు విఫలమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
Advertisement
Tahlequah
Killer Whale
Tour of Grief
British Columbia
Southern Resident Orcas
Animal Emotions

More Telugu News