లండన్‌లో ఎంబీఏ చదువుతోందని కుటుంబసభ్యులు భావిస్తుండగా, ఓ మహిళ పుణేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన ముగ్ధా దేశ్‌ముఖ్ (34) పింప్రి చించ్‌వాడ్‌లోని ఓ ఫ్లాట్‌లో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కుటుంబానికి తెలియకుండా ఆమె యూకే నుంచి రహస్యంగా తిరిగి రావడం, ఆపై మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే, ముగ్ధా దేశ్‌ముఖ్ 2025 జులైలో ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లింది. అక్కడే ఉంటూ ఎంబీఏ చదువుకుంటున్నట్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు కుటుంబసభ్యులతో నిరంతరం ఫోన్, మెసేజ్‌ల ద్వారా మాట్లాడుతూ ఉండేది. అయితే, కుటుంబసభ్యులకు తెలియకుండా ఆమె 2026 ఆగస్టులోనే రహస్యంగా భారత్‌కు తిరిగి వచ్చింది. పుణే సమీపంలోని గహుంజే ప్రాంతంలో ఉన్న లోధా బెల్మొండో కాంప్లెక్స్‌లో గతంలో తాను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో ఒంటరిగా నివసించడం ప్రారంభించింది.

అక్టోబర్ 23న చివరిసారిగా తల్లిదండ్రులతో మాట్లాడిన ముగ్ధా, ఓ జాబ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. లండన్‌లోని ఆమె స్నేహితురాలిని సంప్రదించగా, ముగ్ధా ఆగస్టులోనే యూకే విడిచి వెళ్లినట్లు అక్కడి పోలీసుల ద్వారా తెలిసింది. అదే సమయంలో, ఆమె ఫుడ్ డెలివరీ లావాదేవీలు భారత్‌లో జరిగినట్లు తెలియడంతో, ఆమె ఇక్కడే ఉందని నిర్ధారించుకున్న తండ్రి, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి ఆమె పుణే ఫ్లాట్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా, తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించగా, అప్పటికే కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్ధా మృతదేహం కనిపించింది. శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. మృతికి కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు నమూనాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపారు.

పుణేలో ఉన్న సమయంలో ముగ్ధా ఆన్‌లైన్‌లో ఎంబీఏ విద్యార్థులకు పాఠాలు చెబుతూ జీవనం సాగిస్తోందని, ఎవరితోనూ పెద్దగా కలిసేది కాదని తెలిసింది. ఆమె యూకే నుంచి ఎందుకు రహస్యంగా తిరిగి వచ్చింది? ఆమె మరణానికి గల కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.