రాత్రి పడుకునే ముందు చివరిసారిగా ఫోన్‌ చూడడం, ఉదయం లేవగానే మొదట మొబైల్‌ తీసుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారింది. కొందరు ఫోన్‌ను దిండు కింద, మరికొందరు దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. ఇది సాధారణ అలవాటులా కనిపించినా.. నిద్ర నాణ్యతపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సమస్య ఫోన్‌లో కాదని, పడుకునే ముందు దాన్ని ఎలా వాడుతున్నామన్నదే కీలకమని వివరిస్తున్నారు.

నిద్రపోవాల్సిన మెదడు... మేల్కొని ఉంటుంది
శరీరం నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో మెదడు కూడా నెమ్మదిగా విశ్రాంతి దశలోకి వెళ్లాలి. కానీ ఆ సమయంలో సోషల్‌ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్స్‌, వీడియోలు చూస్తే మెదడు చురుగ్గానే ఉంటుంది. పది నిమిషాలు మాత్రమే అనుకుని ఫోన్‌ తీసుకున్నా తెలియకుండానే అరగంట, గంట గడిచిపోతుంది. ఫోన్‌ పక్కన పెట్టినా చూసిన విషయాలనే మెదడు ఆలోచిస్తూ ఉండటంతో నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘డూమ్‌స్క్రోలింగ్‌’ మరో పెద్ద సమస్య
నిద్రకు ముందు ప్రయోజనం లేకుండా వరుసగా వార్తలు, వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులు చూస్తూ ఉండటాన్ని ‘డూమ్‌స్క్రోలింగ్‌’గా పిలుస్తారు. ఒక వార్తతో మొదలైన స్క్రోలింగ్‌ మరోదానికి, ఇంకోదానికి దారి తీస్తూ సమయాన్ని మరిచిపోయేలా చేస్తుంది. దీంతో మెదడు ఎప్పుడూ సమాచారాన్ని స్వీకరిస్తూనే ఉండి విశ్రాంతి దశలోకి వెళ్లలేకపోతుంది. ఫలితంగా నిద్ర ఆలస్యమవుతుంది.

స్క్రీన్‌ వెలుగు కూడా ప్రమాదం
స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాంతి వల్ల నిద్రను నియంత్రించే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిలో మార్పులు రావచ్చు. దాంతో శరీరానికి నిద్ర సమయం వచ్చిందనే సంకేతాలు ఆలస్యంగా అందుతాయి. ఫలితంగా నిద్ర పట్టడం కష్టమవడంతో పాటు మరుసటి రోజు కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకున్న భావన కలగకపోవచ్చు.

ఫోన్‌ వాడకపోయినా ప్రభావం ఉండొచ్చు
ఫోన్‌ను తాకకపోయినా అది పక్కనే ఉందనే భావన కూడా మెదడును అప్రమత్తంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా కాల్‌ వస్తుందేమో, మెసేజ్‌ వచ్చిందేమో అనే ఆలోచన పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వదు. కొందరికి ఫోన్‌ వైబ్రేట్‌ అయినట్టు అనిపించడం, స్క్రీన్‌ వెలిగిందని భావించి చెక్‌ చేయడం కూడా ఇదే కారణంతో జరుగుతుందని చెబుతున్నారు.

భావోద్వేగాలూ నిద్రను దూరం చేస్తాయి
ఫోన్‌లో కనిపించే ప్రతి విషయం మనసుపై ప్రభావం చూపుతుంది. సరదా వీడియో ఉత్సాహాన్ని పెంచొచ్చు. ఉద్యోగానికి సంబంధించిన మెసేజ్‌ టెన్షన్‌ కలిగించొచ్చు. సోషల్‌ మీడియాలో కనిపించే పోస్టులు ఆనందం, కోపం, ఆందోళన వంటి భావోద్వేగాలను రేకెత్తించొచ్చు. ఫోన్‌ను పక్కన పెట్టినా ఆ ఆలోచనలు కొనసాగుతుండటంతో మెదడు ప్రశాంతంగా మారడానికి సమయం పడుతుంది.

మరుసటి రోజుపై ప్రభావం
నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. శరీరం, మెదడు పునరుత్తేజం పొందే సమయం కూడా. నిద్ర నాణ్యత తగ్గితే మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, పనిపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇలా తరచూ జరిగితే పగటిపూట మెలకువ కోసం కాఫీపై ఆధారపడడం, రాత్రికి మళ్లీ నిద్ర పట్టకపోవడం వంటి సమస్య మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు
ప్రతి ఒక్కరూ రాత్రి ఫోన్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే పడుకునే ముందు ఫోన్‌ వినియోగాన్ని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. పుస్తకం చదవడం, ధ్యానం చేయడం, ప్రశాంతంగా కూర్చోవడం వంటి అలవాట్లు మెదడును నిద్రకు సిద్ధం చేస్తాయి. కొందరు ఫోన్‌ను దిండు పక్కన కాకుండా కొంచెం దూరంగా ఉంచడం, ‘డూ నాట్‌ డిస్టర్బ్‌’ మోడ్‌ ఆన్‌ చేయడం కూడా ఉపయోగపడొచ్చని పేర్కొంటున్నారు.