ఓ చైనా స్టాండ్-అప్ కమెడియన్ లైవ్ షోలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది. వేదికపై తనను కౌగిలించుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆమె చాకచక్యంగా ఎదుర్కొన్న తీరు, అతని అసలు జాతీయతను బయటపెట్టిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఓ చైనా మహిళా కమెడియన్ తన షోలో ప్రదర్శన ఇస్తుండగా, ప్రేక్షకుల మధ్యలో నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా వేదికపైకి దూసుకొచ్చి ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె, అతని చేతిని గట్టిగా పక్కకు నెట్టివేసింది. అనంతరం "మీరు ఎక్కడి నుంచి వచ్చారు?" అని ప్రశ్నించింది. దానికి ఆ వ్యక్తి 'ఇండియా' అని సమాధానమిచ్చాడు.

ఆ సమాధానానికి ఆమె నవ్వి, "మా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇండియనే. మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు?" అని మరో ప్రశ్న వేసింది. ఈ ఊహించని ప్రశ్నతో కంగుతిన్న ఆ వ్యక్తి, తాను భారతీయుడిని కాదని, పాకిస్థాన్‌కు చెందినవాడినని ఒప్పుకున్నాడు. ఈ మొత్తం సంభాషణతో కూడిన క్లిప్‌ను ఆ కమెడియనే "చివరి వరకు చూడండి" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విదేశాల్లో ప్రయాణించేటప్పుడు కొందరు పాకిస్థానీలు తమను తాము భారతీయులుగా పరిచయం చేసుకుంటారని పరోక్షంగా సూచిస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టింది.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో పెట్టిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. కమెడియన్ సమయస్ఫూర్తిని, తెలివైన ప్రశ్నను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒకే ఒక్క ప్రశ్నతో అబద్ధాన్ని ఎలా బయటపెట్టిందోనంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఒక వ్యక్తి ప్రవర్తనకు అతని జాతీయతను ముడిపెట్టడం సరికాదని, ఇలాంటి ఘటనలను భౌగోళిక రాజకీయాలతో పోల్చవద్దని సూచిస్తున్నారు. వేదికపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై కూడా పలువురు మండిపడుతున్నారు. మొత్తంగా ఈ చిన్న ఘటన ఇప్పుడు జాతీయత, వింత‌ ప్రవర్తన, వ్యక్తిగత గుర్తింపు వంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది.