ఫిఫా వరల్డ్ కప్ పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ను పూర్తిగా ఫాలో అవుతున్న బిగ్ బీ
- కొన్ని మ్యాచ్ లలో రిఫరీల నిర్ణయాలు అన్యాయంగా ఉంటున్నాయని విమర్శ
- చిన్న దేశాలు అద్భుత విజయాలు సాధించడం మజా ఇస్తోందని వ్యాఖ్య
ప్రస్తుతం జరుగున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లు ఫుట్‌బాల్ అభిమానులకు అసలైన పూనకాలు తెప్పిస్తున్నాయి. బాలీవుడ్ అగ్రకథానాయకుడు, శతాబ్దపు నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ మెగా టోర్నమెంట్‌ను పూర్తిగా ఫాలో అవుతున్నారు. అయితే, ఈ టోర్నీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన బ్లాగ్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
మ్యాచ్‌ల టైమింగ్స్ వల్ల తన రోజువారీ షెడ్యూల్ మొత్తం తలకిందులైందని, అయినా సరే నిద్ర చెడగొట్టుకుని మరీ లైవ్ చూస్తున్నానని బిగ్ బి పేర్కొన్నారు. అయితే కొన్ని మ్యాచ్‌లలో రిఫరీల నిర్ణయాలు ఏకపక్షంగా, అన్యాయంగా అనిపిస్తున్నాయంటూ పెదవి విరిచారు. ఇదే సమయంలో, ఎలాంటి అంచనాలు లేని చిన్న దేశాలు అద్భుత విజయాలు సాధించడం భలే మజా ఇస్తోందని, టైటిల్ ఫేవరెట్ అనుకున్న పెద్ద జట్లు అనూహ్యంగా కుప్పకూలడం చూసి షాకయ్యానని సరదాగా చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ ఫుట్‌బాల్ మహాసంగ్రామం చివరి ఘట్టానికి చేరుకుంది. నేడు స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల మధ్య సెమీ ఫైనల్ పోరు జరగనుంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, 2010లో కప్ కొట్టిన స్పెయిన్ ని కూడా తక్కువ అంచనా వేయలేం.