సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!

Sleep deprivation increases heart disease risk say experts
  • గుండె ఆరోగ్యాన్ని కీలక ఆధారం నిద్ర
  • నిద్రలో హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ కీలక ప్రక్రియలు జరుగుతాయి
  • ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది
  • దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా పెంచుతుంది
  • రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచన
మన శరీరానికి నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడే కీలక ఆధారం కూడా. రోజూ సరిపడా, నాణ్యమైన నిద్ర లేకపోతే గుండెపై అదనపు భారం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నిద్ర సమయంలో శరీరం తనను తాను పునరుద్ధరించుకోవడంతో పాటు హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం వంటి కీలక ప్రక్రియలు జరుగుతాయి. ఈ విశ్రాంతి దశ తగ్గిపోతే గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా ఆరోగ్యకరమైన నిద్రలో రక్తపోటు 10 నుంచి 20 శాతం వరకు తగ్గి, గుండె స్పందన కూడా నెమ్మదిస్తుంది. అయితే రోజుకు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది. దీంతో రక్తపోటు ఎక్కువసేపు అధికంగానే ఉండటం, ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీసే ప్రధాన కారణాలుగా మారతాయి.

నిద్రలేమి శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా పెంచుతుంది. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అధికమవుతుంది. అలాగే మధుమేహం, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రకు ముందు మొబైల్ లేదా ఇతర స్క్రీన్‌ల వినియోగాన్ని తగ్గించడం, రాత్రి వేళల్లో కాఫీ, మద్యం, భారీ భోజనానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించడం వంటి అలవాట్లు పాటించాలని చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
Advertisement
Sleep Deprivation
Heart Disease Risk
High Blood Pressure
Cardiovascular Health
Insomnia Complications
Heart Attack Prevention

More Telugu News