ఆకస్మికంగా మాట పడిపోవడం, శరీరం ఒకవైపు చచ్చుబడిపోవడం, నడవడానికి ఇబ్బంది పడటం.. ఇవన్నీ స్ట్రోక్ (పక్షవాతం) లక్షణాలు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో మొదటి కొన్ని నిమిషాల్లో మనం స్పందించే తీరు బాధితుల ప్రాణాలను కాపాడటమే కాకుండా, వారి భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. 

చాలామంది ఈ లక్షణాలను తాత్కాలిక నీరసం లేదా అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, స్ట్రోక్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత మెరుగైన చికిత్స అందించి, శాశ్వత వైకల్యం బారిన పడకుండా కాపాడవచ్చు. అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, ఈ మహమ్మారిపై అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్లగానీ, రక్తనాళం చిట్లడం వల్లగానీ మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఆక్సిజన్, పోషకాలు అందని మెదడు కణాలు దెబ్బతినడం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎంత ఎక్కువసేపు కొనసాగితే, అంత తీవ్రమైన నష్టం జరుగుతుంది. 

శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే, స్ట్రోక్ లక్షణాలను గుర్తించి, తక్షణమే స్పందించడం చాలా ముఖ్యం అని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్ న్యూరాలజీ కన్సల్టెంట్, స్ట్రోక్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ సురభి చతుర్వేది సూచిస్తున్నారు.

స్ట్రోక్‌ను గుర్తించేందుకు ‘FAST’ పద్ధతి
స్ట్రోక్ లక్షణాలను సులభంగా గుర్తించడానికి ‘FAST’ అనే పద్ధతిని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

F (FACE - ముఖం): బాధితులను నవ్వమని చెప్పాలి. వారి ముఖంలో ఒకవైపు కండరాలు కిందికి జారిపోయినట్లు లేదా వంకరగా కనిపిస్తుందో లేదో గమనించాలి.
A (ARMS - చేతులు): రెండు చేతులను పైకి ఎత్తమని కోరాలి. ఒక చేయి నీరసంగా కిందికి జారిపోతుంటే అది స్ట్రోక్ లక్షణం కావచ్చు.
S (SPEECH - మాట): ఏదైనా ఒక చిన్న వాక్యాన్ని తిరిగి చెప్పమని అడగాలి. మాట తడబడుతున్నా, సరైన పదాలు దొరక్క ఇబ్బంది పడుతున్నా, లేదా చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నా అది స్ట్రోక్‌కు సంకేతం.
T (TIME - సమయం): పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయని వేచి చూడటం అత్యంత ప్రమాదకరం.

ఇవి కాకుండా, శరీరంలో ఒకవైపు మొద్దుబారడం, ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మందగించడం, నడవడంలో తడబాటు, తీవ్రమైన తలనొప్పి వంటివి కూడా స్ట్రోక్ లక్షణాలు కావచ్చు. కొన్నిసార్లు ఈ లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోయినా, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

అంబులెన్స్ వచ్చేలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్ట్రోక్ అని అనుమానం వచ్చిన వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయో స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం చికిత్సకు చాలా కీలకం. అంబులెన్స్ వచ్చే వరకు బాధితుడిని సురక్షితంగా, సౌకర్యవంతంగా కూర్చోబెట్టాలి లేదా పడుకోబెట్టాలి. వారు శ్వాస సరిగ్గా తీసుకుంటున్నారో లేదో గమనిస్తూ ఉండాలి. 

బాధితులకు ఎలాంటి ఆహారం, నీళ్లు లేదా మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే స్ట్రోక్ వల్ల మింగే సామర్థ్యం దెబ్బతిని, అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, వైద్యుల సలహా లేకుండా యాస్పిరిన్ వంటి మందులు అస్సలు ఇవ్వకూడదు. కొన్ని స్ట్రోక్‌లు మెదడులో రక్తస్రావం వల్ల వస్తాయి. అలాంటి సమయంలో యాస్పిరిన్ ఇస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది.

అంబులెన్స్ అందుబాటులో ఉంటే, సొంత వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయవద్దు. అంబులెన్స్‌లోని సిబ్బంది ప్రయాణ సమయంలోనే ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి సమాచారం ఇస్తారు. ఆసుపత్రిలో వైద్యులు సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ ద్వారా స్ట్రోక్ రక్తపు గడ్డ వల్ల వచ్చిందా? లేక రక్తస్రావం వల్ల వచ్చిందా? అని నిర్ధారిస్తారు. దానిని బట్టి చికిత్సా విధానం ఉంటుంది. 

లక్షణాలు మొదలైన కొన్ని గంటలలోపు ఆసుపత్రికి చేరుకుంటే, థ్రాంబోలిటిక్ థెరపీ (రక్తాన్ని పలచబరిచే మందులు) లేదా మెకానికల్ థ్రాంబెక్టమీ (రక్తపు గడ్డను తొలగించే ప్రక్రియ) వంటి ఆధునిక చికిత్సల ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం విలువైనదే. లక్షణాలను గుర్తించడం, వెంటనే స్పందించడం, సొంత వైద్యాలకు దూరంగా ఉండటం వంటి చర్యలు ఒకరి ప్రాణాలను కాపాడగలవని డాక్టర్ సురభి చతుర్వేది నొక్కిచెప్పారు. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు ఈ విషయాలపై అవగాహన కల్పించడం మనందరి బాధ్యత.