దేశంలో పెరుగుతున్న పొగమంచు, వాయు కాలుష్యం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, కాలుష్యానికి నిరంతరం గురవడం వల్ల వారి ఊపిరితిత్తుల ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని, ఇది భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దలతో పోలిస్తే పిల్లల ఊపిరితిత్తులు సున్నితంగా ఉంటాయి. అవి యుక్తవయస్సు వచ్చే వరకు ఎదుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా, పిల్లలు వారి శరీర పరిమాణంతో పోలిస్తే వేగంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల ఎక్కువ మోతాదులో కాలుష్య కారకాలు వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. గాలిలోని PM2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోపలికి సులభంగా చేరి, వాపు, మంటకు కారణమవుతాయి.

కాలుష్య ప్రభావం వెంటనే బయటపడకపోయినా, ఊపిరితిత్తుల ఎదుగుదల, శ్వాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని, ఈ నష్టం యుక్తవయస్సులో కూడా కొనసాగుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. తరచూ కాలుష్యానికి గురవడం వల్ల పిల్లల్లో దగ్గు, జలుబు, ఆయాసం, ఆస్తమా వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా ఇదే విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం పిల్లల ఊపిరితిత్తుల ఎదుగుదలను కుంటుపరుస్తోందని, ఇది వారి అభ్యసన సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని అన్నారు. అధిక కాలుష్యానికి ఎక్కువ కాలం గురవడం అనేది సిగరెట్లు తాగడంతో సమానమని ఆమె పోల్చారు. ఈ నేపథ్యంలో, పిల్లల్లో దీర్ఘకాలిక దగ్గు, ఆడుకునేటప్పుడు ఆయాసం, రాత్రిపూట ఇబ్బందులు, ఆస్తమా లక్షణాలు పెరగడం వంటివి గమనిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.