ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది రేపు (ఆదివారం) సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం, సోమవారం (నవంబర్ 2) సాయంత్రం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అధికార యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.