టమాటా–గుడ్డు కూర ధర రూ.7,300.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటి?

Tomato Egg Curry priced at 7300 rupees what is the specialty
  • షాంఘై రెస్టారెంట్‌లో ప్రత్యేక వంటకం
  • జర్మనీ నుంచి తెప్పించిన ఈము గుడ్డుతో తయారీ
  • ప్రీమియం ‘ప్రొవెన్స్‌’ టమాటాల వినియోగం
  • సుత్తితో గుడ్డును పగలగొట్టాల్సిన పరిస్థితి
  • రోజుకు ఒక్క ప్లేట్‌ మాత్రమే విక్రయం
  • ధరపై చైనా సోషల్‌ మీడియాలో చర్చ
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో సాధారణంగా ప్రతి ఇంట్లో చేసే టమాటా-గుడ్డు కూర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం రుచి కాదు.. ధర. టమాటా, గుడ్లతో చేసే ఈ వంటకానికి ఏకంగా రూ.7,300కు పైగా వసూలు చేస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వంటకం షాంఘైలోని జిన్‌లాంగ్‌ డాబియన్‌లూ రెస్టారెంట్‌లో లభిస్తోంది. సాధారణ కోడి లేదా బాతు గుడ్ల బదులు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న పెద్ద ఈము గుడ్డును ఇందులో ఉపయోగిస్తున్నారు. ఈ ఒక్క గుడ్డు ధరే దాదాపు 150 యువాన్లు (సుమారు రూ.2,100) ఉంటుందని చెబుతున్నారు. టమాటాల కోసం మరో 50 యువాన్లు (సుమారు రూ.700) ఖర్చు చేస్తున్నారు.

ఈ వంటకంలో వాడే టమాటాలు కూడా సాధారణమైనవి కావు. నెదర్లాండ్స్‌కు చెందిన ‘ప్రొవెన్స్‌’ రకం టమాటాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇవి ఎక్కువ రసంతో ఉండే ప్రీమియం రకం. దీంతో వంటకంలో వాడే పదార్థాల ఖర్చే సాధారణ టమాటా-గుడ్డు కూరతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటోంది.

ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈము గుడ్డు పెంకు చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టేందుకు చిన్న సుత్తి కూడా ఉపయోగిస్తున్నారు. అయితే గుడ్డు పగిలిన తర్వాత వంట చేసే విధానం మాత్రం సాధారణ టమాటా-గుడ్డు కూరలాగే ఉంటుంది.

ఈ వంటకం ఖరీదు ఎక్కువగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. రోజుకు ఒక్క ప్లేట్‌ మాత్రమే తయారు చేస్తారు. అదీ ముందుగానే బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ధరను సాధారణ హోటల్‌ లెక్కల ప్రకారం నిర్ణయించలేదని చెఫ్‌ స్థానిక మీడియాకు తెలిపాడు.

ఈ వంటకం ఇప్పుడు చైనా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంట్లో సులభంగా చేసుకునే వంటకానికి ఇంత భారీ ధర చెల్లించడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రత్యేక అనుభవం కోసం ఖర్చు చేయాలా? వద్దా? అనేది పూర్తిగా కస్టమర్ల ఇష్టమని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Tomato Egg Curry
Shanghai Restaurant
Emu Egg Dish
Expensive Food China
Provence Tomatoes
Xinlong Dabianlu

More Telugu News