ఏదైనా తిని వ్యాయామం చేయాలా? ఖాళీ కడుపుతో చేయాలా? నిపుణుల సమాధానం ఇదే!
- ఖాళీ కడుపుతో వ్యాయామం అందరికీ సరిపోదంటున్న నిపుణులు
- తక్కువ తీవ్రత వ్యాయామానికి అయితే కొంత ప్రయోజనం
- కఠిన వ్యాయామానికి ముందే శక్తి అవసరమన్న ఎక్స్‌పర్ట్స్
- వ్యాయామానికి 30–60 నిమిషాల ముందు తినాలి
- కార్బ్స్, కొద్దిపాటి ప్రోటీన్ ఉత్తమం
- ఎక్కువ నూనె, పీచు ఉన్న ఆహారం వద్దు
ఖాళీ కడుపుతో చేసే వ్యాయామాన్ని ‘ఫాస్టెడ్ వర్కౌట్’ అంటారు. తక్కువ తీవ్రతతో చేసే నడక, తేలికపాటి కార్డియో వంటి వ్యాయామాల్లో ఇది కొంతమేర కొవ్వు కరిగేందుకు సాయపడొచ్చు. అయితే అధిక తీవ్రతతో చేసే వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్, ఎక్కువసేపు కొనసాగే వర్కౌట్లకు శరీరానికి ముందే శక్తి అవసరం. అలాంటి సమయంలో ఏమీ తినకుండా వ్యాయామం చేస్తే త్వరగా అలసట వస్తుంది. పనితీరు తగ్గుతుంది. కొందరికి తల తిరగడం, బలహీనంగా అనిపించడం కూడా జరగొచ్చు. కండరాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. కొద్దిపాటి ప్రొటీన్ కండరాల సంరక్షణకు ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ నూనె, కొవ్వులు, అధిక పీచు ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించి వ్యాయామం సమయంలో అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది.
వ్యాయామానికి ముందు ఓట్స్‌తో ప్రొటీన్ పౌడర్, గోధుమ బ్రెడ్‌తో గుడ్లు, పెరుగు, కాల్చిన మఖానా, స్మూతీ, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్, అరటిపండు వంటి ఆహారాలు మంచి ఫలితాలిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు త్వరగా అలసిపోకుండా సాయపడతాయి.
అంతేకాదు, వ్యాయామానికి ముందు, మధ్యలో, తర్వాత తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. శరీరంలో నీటి కొరత ఏర్పడితే పనితీరు తగ్గడంతో పాటు త్వరగా అలసట వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాయామంతో పాటు సరైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్‌కు కీలకమని నిపుణులు చెబుతున్నారు.