గాడిద, మేక పాలు తాగి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆదోని ఎమ్మెల్యే!

Adoni MLA surprises everyone by drinking donkey and goat milk
  • ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి వినూత్న పర్యటన
  • వీధిలో అమ్ముతున్న గాడిద పాలు కొని తాగిన వైనం
  • స్వయంగా మేక పాలు పితికి అక్కడే సేవించిన ఎమ్మెల్యే
  • మేక, గాడిద పాలు ఆరోగ్యానికి శ్రేష్టమన్న పార్థసారథి
కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తన నియోజకవర్గ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఆయన వీధిలో విక్రయిస్తున్న గాడిద పాలు, మేక పాలు తాగి వార్తల్లో నిలిచారు.

‘ప్రజల కోసం మీ ఎమ్మెల్యే’ పేరుతో పార్థసారథి పట్టణంలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అరుణ్ జ్యోతి నగర్‌లో పర్యటిస్తుండగా, గాడిద పాలు అమ్ముతున్న ఒక వ్యక్తిని చూసి ఆప్యాయంగా పలకరించారు. అతని వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతని వద్ద గాడిద పాలను కొనుగోలు చేసి అక్కడికక్కడే తాగారు.

ఆ తర్వాత మహాత్మా గాంధీ నగర్‌లో పర్యటిస్తున్నప్పుడు, మేకల కాపరి శివన్నను చూసి ఆయన వద్దకు వెళ్లారు. అతని జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తానే స్వయంగా ఒక మేక పాలు పితికి తాగారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. "గాడిద, మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పాలు తాగితే శరీరంలోని అవయవాలు శుద్ధి అవుతాయని చెబుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పాలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్న ఈ యువకుడిని అభినందిస్తున్నాను" అని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునే పర్యటనలో ఎమ్మెల్యే ఇలా సామాన్యులతో కలిసిపోవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.
Parthasarathi
Adoni MLA
Kurnool district
Donkey milk
Goat milk
Praja Kosam Mee MLA

More Telugu News