భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో భారీ పాదయాత్ర జరగనుంది. 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకాన్ని అంతం చేయండి' అనే నినాదంతో చాందినీ చౌక్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ పాదయాత్రలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొంటారని పార్టీ మంగళవారం రాత్రి 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కూడా పాదయాత్రలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, భారత ఎన్నికల సంఘం తీరును ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. కాగా, గాంధీ కుటుంబం కేవలం సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉందని నితిన్ నబిన్ గతంలో పనాజీలో విమర్శించారు.

మరోవైపు, ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 'ఓటు బచావో, దేశ్ బచావో' పేరుతో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని, 'ఓటు చోరీ'కి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా, బీజేపీ నవంబర్ 1 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్త కౌంటర్ క్యాంపెయిన్‌కు సమాయత్తమవుతోంది.