ఉదయం లేచిన వెంటనే ఒక కప్పు టీ. సాయంత్రం అలసటగా అనిపించినా టీ. భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ చాలామంది గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండింటిలో ఏది మంచిది? ఏది తాగితే ఎక్కువ ప్రయోజనం? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ రెండూ ఒకే మొక్క నుంచి తయారవుతాయి. అయితే ప్రాసెసింగ్‌ విధానం వేరు. అదే వాటి రుచి, రంగు, ఆరోగ్య ప్రయోజనాల్లో తేడాలకు కారణమవుతోంది.

గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ‘కాటెకిన్స్‌’ అనే సమ్మేళనాలు శరీర కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి. కొవ్వు కరిగించడంలో గ్రీన్‌ టీ కొంత మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే ఎల్‌-థియానిన్‌ అనే పదార్థం మనసును ప్రశాంతంగా ఉంచుతూ ఏకాగ్రతను పెంచుతుంది.

బ్లాక్‌ టీ మాత్రం పూర్తిగా ఆక్సిడేషన్‌ ప్రక్రియలో తయారవుతుంది. దీంతో దీనికి ముదురు రంగు, గట్టి రుచి వస్తాయి. ఇందులో థియాఫ్లావిన్స్‌, థియారుబిజిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో సాయపడతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా బ్లాక్‌ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్‌ టీతో పోలిస్తే ఇందులో కెఫిన్‌ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల త్వరగా ఉత్సాహాన్ని అందిస్తుంది.

అయితే ఈ రెండింటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. గ్రీన్‌ టీ ఎక్కువగా తాగితే శరీరంలో ఐరన్‌ శోషణ తగ్గే అవకాశం ఉంది. కొందరిలో కడుపు మంట లేదా అసౌకర్యం కలగొచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే ఇబ్బంది పెరగవచ్చు. బ్లాక్‌ టీ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అధికంగా తీసుకుంటే ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో యాసిడ్‌ రిఫ్లక్స్‌ లేదా ఛాతిలో మంట పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఐరన్‌ శోషణపై ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మరి ఏది మంచిది? దీనికి ఒక నిర్దిష్టమైన సమాధానం లేదు. బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయుల నిర్వహణ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రయోజనాల కోసం చూస్తే గ్రీన్‌ టీ మంచి ఎంపికగా భావించవచ్చు. గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ పనితీరు, ఎక్కువ ఉత్సాహం కోరుకునేవారికి బ్లాక్‌ టీ ఉపయోగపడుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండింటినీ పరిమితంగా తీసుకుంటే మంచిదే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవాలి. ఒకదానిని పూర్తిగా వదిలేసి మరొకదానిపై ఆధారపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.