వైసీపీ మద్యం పాలసీ వల్ల మన ఆదాయం అటు మళ్లింది: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra says Telangana benefited from five years of YSRCP rule in Andhra Pradesh
  • వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీకి రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందన్న మంత్రి కొల్లు
  • తప్పుడు మద్యం విధానాల వల్ల తెలంగాణకు భారీగా ఆదాయం
  • నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించి వేలకోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపణ
గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనుసరించిన లోపభూయిష్టమైన మద్యం విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.18,860 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని, ఆ ఆదాయం పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు మళ్లిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని, ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం జరిగిందని విమర్శించారు.

మద్యం ధరలను 75 శాతం వరకు పెంచడం, ప్రభుత్వ దుకాణాల ద్వారా నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించడం, వైకాపా నేతలకు సంబంధించిన సంస్థలకే వ్యాపారాన్ని కట్టబెట్టడం వంటి కారణాలతో ఏపీలో చట్టబద్ధమైన విక్రయాలు పడిపోయాయని మంత్రి వివరించారు. దీనివల్ల డ్యూటీ చెల్లించని మద్యం, సరిహద్దుల్లోని తెలంగాణ దుకాణాల నుంచి అమ్మకాలు పెరిగాయని తెలిపారు. 2019-2024 మధ్య కాలంలో ఏపీ, తెలంగాణ మద్యం అమ్మకాల మధ్య వ్యత్యాసం రూ.42,762 కోట్లకు పెరిగిందని, గతంలో తమ హయాంలో ఇది కేవలం రూ.4,186 కోట్లుగా ఉండేదని గణాంకాలతో సహా వివరించారు.

వైకాపా పాలనలో జరిగిన రూ.99,413 కోట్ల అమ్మకాల్లో కేవలం రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ రూపంలో జరిగాయని, మిగిలినదంతా నగదు రూపంలోనే సాగిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యమైన బ్రాండ్ల వాటా 51 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని, ఇది సుమారు రూ.3,500 కోట్ల భారీ కుంభకోణమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు దుకాణాల విధానాన్ని పునరుద్ధరించడం, రూ.99 కే క్వార్టర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్ లావాదేవీలను 60 శాతానికి పెంచడం వంటి సంస్కరణలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కాపాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.                                
Go Back to Shorts
Kollu Ravindra
Andhra Pradesh Excise Policy
YSRCP Liquor Scam
Telangana Liquor Sales
Andhra Pradesh Revenue Loss
AP New Liquor Policy

More Telugu News