ఏం చేద్దాం?.. రాహుల్‌తో అభిషేక్‌ బెనర్జీ రహస్య మంతనాలు!

Abhishek Banerjee secret meeting with Rahul Gandhi on Bengal crisis
  • తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌
  • ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో సతమతం
  • ఢిల్లీలో నిన్న సోనియాతో మమతా బెనర్జీ భేటీ
  • నేడు అభిషేక్‌ బెనర్జీ మంతనాలు
  • రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామాలు
బెంగాల్‌లో తృణమూల్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీ తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తించింది. నిన్నే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సుదీర్ఘంగా చర్చలు జరపడం గమనార్హం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చలు నడిచాయి. బెంగాల్‌లో ఘోర ఓటమి తర్వాత బీజేపీ అక్కడ ‘ఆపరేషన్ లోటస్’ ముమ్మరం చేసిందని, తృణమూల్‌ను నిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీకి అభిషేక్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ రాజకీయ మద్దతును కోరినట్లు సమాచారం.
మరోవైపు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్తులో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించారు.

గతంలో కాంగ్రెస్‌తో పొత్తుకు అంతగా ఆసక్తి చూపని మమతా బెనర్జీ ప్రస్తుత సంక్షోభం తర్వాత తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. ఇటీవలి ఇండియా కూటమి సమావేశంలో కూడా కాంగ్రెస్‌పై ఇతర మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు అండగా నిలబడటం గమనార్హం. బెంగాల్‌లో కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్‌తో బంధాన్ని బలోపేతం చేసుకోవడమే తమ పార్టీకి రక్షణ కవచమని టీఎంసీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మరోవైపు, అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి సమయంలోనూ రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం ఇరు పార్టీల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ప్రస్తుతం బెంగాల్‌లో సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మమతా బెనర్జీకి.. ఈ ఢిల్లీ పర్యటన, రాహుల్-సోనియాలతో జరిపిన చర్చలు ఎంతవరకు రాజకీయ ఊరటనిస్తాయో వేచి చూడాలి.
Go Back to Shorts
Abhishek Banerjee
Rahul Gandhi
Mamata Banerjee
Trinamool Congress
West Bengal Politics
India Alliance

More Telugu News