19 ఏళ్ల యువతి వింత అనుభవం.. కోమాలో తల్లిగా మారిపోయిన వైనం.. మేల్కొని కలలోని పిల్లల కోసం ఆరాటం!

Teen Wakes Up From Coma Believing She Gave Birth To Triplets
  • మూడు వారాల కోమా నుంచి మేల్కొన్న 19 ఏళ్ల యువతి
  • తన ముగ్గురు కూతుళ్ల కోసం ఆరాటపడి వైద్యులను ఆశ్చర్యపరిచిన వైనం
  • ఏడేళ్లుగా పిల్లలను పెంచినట్టు కోమాలో క‌ల‌గ‌న్న ఫ్రాన్స్‌ యువ‌తి 
  • అదంతా భ్రాంతేనని, అసలు పిల్లలే లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి
  • కోమాలో మెదడు సృష్టించిన ఒక భ్రాంతి అని న్యూరాలజిస్టుల వెల్లడి
ఫ్రాన్స్‌లోని లియోన్‌కు చెందిన 19 ఏళ్ల క్లెలియా వెర్డియర్ కథ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మూడు వారాల కోమా నుంచి మేల్కొన్న ఆమె, తన ప్రమాదం గురించి గానీ, నొప్పి గురించి గానీ కాకుండా.. "నా ముగ్గురు కూతుళ్లు ఎక్కడున్నారు?" అని ప్రశ్నించి వైద్యులను విస్మయానికి గురిచేసింది. అయితే, అసలు వాస్తవం ఏమిటంటే ఆమెకు పెళ్లి కాలేదు, పిల్లలు కూడా లేరు. కోమాలో ఆమె మెదడు సృష్టించిన ఒక భ్రాంతిలో ఏడేళ్లుగా తల్లిగా జీవించింది.

2025 జూన్‌లో క్లెలియా అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో వైద్యులు ఆమెను మూడు వారాల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచారు. స్పృహలోకి రాగానే, ఆమె తన కుమార్తెలు మిలా, మైల్స్, మైలీల కోసం తీవ్రంగా ఆరాటపడింది. వారిని తన వద్దకు తీసుకురావాలని వేడుకుంది. వైద్యులు ఆమెకు అసలు గర్భధారణే జరగలేదని, పిల్లలు లేరని చెప్పడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

కోమాలో ఉన్నప్పుడు తనకు కలలు వచ్చాయని క్లెలియా వివరించింది. "ఆ కలలో నేను ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాను. వారిలో మైలీ పుట్టిన కొద్దిసేపటికే చనిపోవడంతో తీవ్రమైన బాధ, అపరాధ భావన కలిగాయి. పిల్లలు పుట్టాక వారిని మొదటిసారి నా చర్మానికి తాకించినప్పుడు కలిగిన అనుభూతి అద్భుతం. అంతులేని ప్రేమను అనుభవించాను" అని ఆమె చెప్పింది.

కేవలం జననం మాత్రమే కాదు, ఏడేళ్ల పాటు ఆ పిల్లలతో గడిపిన జీవితం కూడా ఆమెకు స్పష్టంగా గుర్తుంది. వారితో కలిసి భోజనం చేయడం, పార్కులకు వెళ్లడం, నిద్రపోయే ముందు కథలు చెప్పడం వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తన మనసులో నిలిచిపోయాయని తెలిపింది. "ఆ కలలే నా వాస్తవ ప్రపంచంగా మారాయి. కోమా నుంచి బయటకు వచ్చాక నా తల్లిదండ్రులను చూసి, మీరు తాతయ్య, నానమ్మ అయ్యారని చెప్పాను. కానీ, నా పిల్లలు లేరని తెలిశాక తట్టుకోలేకపోయాను. ఏడాది గడిచినా నేను ఇంకా ఆ బాధలోనే ఉన్నాను. నా కలైనా, భ్రాంతైనా.. నేను ఎప్పటికీ వారి తల్లినే" అని క్లెలియా ఆవేదన వ్యక్తం చేసింది.

న్యూరాలజిస్టుల ప్రకారం మెదడుకు గాయాలైనప్పుడు లేదా కోమాలో ఉన్నప్పుడు ఇలాంటి వాస్తవికమైన కలలు రావడం అసాధారణమేమీ కాదని చెబుతున్నారు. కోమాలో ఉన్నప్పుడు రోగుల మెదడు పూర్తిగా నిష్క్రియాత్మకంగా ఉండదని, కొన్నిసార్లు ఇలాంటి సంక్లిష్టమైన, భావోద్వేగభరితమైన అనుభవాలను సృష్టిస్తుందని వారు వివరించారు.
Go Back to Shorts
Coma Patient
Clelia Verdier
hallucinations
false pregnancy
mental health
suicide attempt
daughters
grief
neurology
dreams

More Telugu News