చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. దీంతో, వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఓట్ల లెక్కింపులో భాగంగా 3, 7, 8 వార్డులలో తమ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారని, ఈ దశలో ఫలితాలను తారుమారు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేయడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.