ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ కొత్త క్రూజర్‌ బైక్‌ను ఆవిష్కరించింది. ‘2027 స్ప్రింట్‌ 440’ పేరుతో తీసుకొచ్చిన ఈ మోటార్‌సైకిల్‌ను ఇటలీలో జరుగుతున్న ఈఐసీఎంఏ 2026 ప్రదర్శనలో పరిచయం చేసింది. హీరో మోటోకార్ప్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బైక్‌.. తక్కువ సీటు ఎత్తు, క్రూజర్‌ తరహా డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. కొత్తగా బైక్‌ నడపడం ప్రారంభించేవారితో పాటు సౌకర్యవంతమైన రైడింగ్‌ కోరుకునేవారిని లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు. 

440 సీసీ ఇంజిన్‌.. 38 ఎన్ఎం టార్క్‌
స్ప్రింట్‌ 440లో 440 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 6,000 ఆర్‌పీఎం వద్ద 27 హెచ్‌పీ శక్తిని, 4,000 ఆర్‌పీఎం వద్ద 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్‌ అండ్‌ స్లిప్పర్‌ క్లచ్‌ ఇచ్చారు. ఐదు, ఆరో గేర్లను హైవేపై సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుగుణంగా రూపొందించారు. లీటరుకు 34 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 

తక్కువ సీటు ఎత్తు.. క్రూజర్‌ లుక్‌
ఈ బైక్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 671 మిల్లీమీటర్ల సీటు ఎత్తు. దీంతో తక్కువ ఎత్తు ఉన్నవారికీ బైక్‌పై కూర్చోవడం, కాళ్లు నేలకు ఆనించడం సులభమవుతుంది. బరువు 187 కిలోలు. టియర్‌డ్రాప్‌ ఆకారంలోని ఫ్యూయల్‌ ట్యాంక్‌, గుండ్రటి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, వెనుకవైపు చిన్న మడ్‌గార్డ్‌, స్టెప్డ్‌ సీటు క్రూజర్‌ రూపానికి మరింత ఆకర్షణను ఇస్తున్నాయి. డార్క్‌ బిలియర్డ్‌ గ్రే, వివిడ్‌ బ్లాక్‌, టీల్ థండర్‌ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 

టీఎఫ్‌టీ డిస్‌ప్లే.. డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌
ఫీచర్ల విషయానికొస్తే.. గుండ్రటి ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో 3.5 అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్‌, యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్టు ఉన్నాయి. ముందు భాగంలో 43 మిల్లీమీటర్ల అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్కులు, వెనుక ఏడు దశల్లో సర్దుబాటు చేసుకునే ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్లు అమర్చారు. ముందు 320 మిల్లీమీటర్లు, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్‌ బ్రేకులతో పాటు డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. 2027 నుంచి వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.