దాడులు, హత్యలు పిన్నెల్లి బ్రదర్స్ కు మామూలే: జూలకంటి బ్రహ్మారెడ్డి

macherla mla brahma reddy Fires on  Pinnelli Brothers
  • మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై మద్యం బాటిల్‌తో దాడి
  • దాడి వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉందన్న బ్రహ్మారెడ్డి
  • మాచర్ల టీడీపీ బాధ్యుడుగా బాధ్యతలు తీసుకున్నప్పుడే అన్నింటికీ తెగించి వచ్చానన్న బ్రహ్మారెడ్డి
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని బ్రహ్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

కారంపూడిలోని వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో నిన్న బ్రహ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. పసర్లపాడు సమీపంలో తన కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు మద్యం బాటిల్‌తో దాడి చేశారని తెలిపారు. ఇది ముమ్మాటికీ పిన్నెల్లి సోదరుల పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. చీకట్లో కార్లపై దాడులు చేతకాని వారు చేయించే పని అన్నారు. దాడులు, హత్యలు చేయించడం పిన్నెల్లి సోదరులకు మామూలేనని వ్యాఖ్యానించారు. వారి నీచ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టినా బుద్ది రాలేదని అన్నారు. వారి మాటలు నమ్మి ఆ పార్టీ కార్యకర్తలు జీవితాలను పణంగా పెట్టొద్దని హితవు పలికారు. శాసనసభ్యుడిపై ఆకతాయిలెవరూ దాడులు చేయలేరన్నారు. "నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో పిన్నెల్లి లాంటి గుంటనక్కలను ఎంతో మందిని చూశా. తాటాకు చప్పుళ్లకు భయపడను," అని బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

మాచర్ల టీడీపీ బాధ్యుడుగా బాధ్యతలు తీసుకున్నప్పుడే అన్నింటికీ తెగించి వచ్చానని జూలకంటి అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని చెబుతున్న పిన్నెల్లి .. తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు, దోపిడీలు, అవినీతిని బయట పెడతానని పేర్కొన్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టానని ఆయన వివరించారు.
 
Go Back to Shorts
MLA Julakanti Brahma Reddy
Palnadu
Macharla
Pinnelli Brothers

More Telugu News