ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ కూటమి హవా కొనసాగిస్తోంది. కడప జిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీని కూటమి పూర్తిస్థాయిలో కైవసం చేసుకుంది. ఈరోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో... పోలింగ్ జరిగిన ఏకైక వార్డులోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఈ క్లీన్‌స్వీప్ పూర్తయింది.

బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 39వ వార్డుకు జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తుడిమెళ్ల విజయ 372 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 40 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో కేవలం ఈ ఒక్క వార్డుకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. మిగిలిన 39 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

ఎన్నికలకు ముందే మున్సిపల్ ఛైర్‌పర్సన్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి సోమేశుల దివ్య తేజ ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఏకగ్రీవమైన 39 వార్డుల్లో టీడీపీ 35 స్థానాలు, జనసేన 2 స్థానాలు గెలుచుకోగా, మరో రెండు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. తాజాగా 39వ వార్డులోనూ టీడీపీ గెలవడంతో బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించినట్లయింది. ఈ విజయంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.