వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత జగన్‌పై పోలీసు కేసు నమోదయింది. కడప జిల్లా పులివెందులలో జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున అనుమతి లేకుండా ధర్నా చేసి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.

నవంబర్ 1వ తేదీన జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. తమ పార్టీ ఏజెంట్లను చాలా పోలింగ్ బూత్‌లలోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ జగన్ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలింగ్‌ను వెంటనే రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

అయితే, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైసీపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఓట్ల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురైన రోజే, ధర్నా ఘటనపై జగన్‌పై కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.