Advertisement

నటనలో దిట్ట.. సంస్కారంలో సున్నా: ప్రకాశ్ రాజ్‌పై నటుడు నాగ మహేశ్ విమర్శనాస్త్రాలు

Naga Mahesh fires on Prakash Raj
  • శ్రీరాముడిని ప్రకాశ్ రాజ్ అవహేళన చేయడంపై నాగ మహేశ్ మండిపాటు
  • వెకిలి వ్యాఖ్యలు ఆయన ఉన్మాదానకి పరాకాష్ఠ అని విమర్శ
  • మోదీ, బీజేపీపై వ్యతిరేకతను ఒక మతంపై ద్వేషంగా మార్చుకున్నారని ఆరోపణ

వెండితెరపై నవరసాలను పండించే ప్రకాశ్ రాజ్, నిజ జీవితంలో మాత్రం కేవలం 'విద్వేషం' అనే రసాన్నే నమ్ముకున్నారని నటుడు నాగ మహేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "జస్ట్ ఆస్కింగ్" అంటూ ప్రశ్నించే నెపంతో ఆయన హిందూ ధర్మాన్ని, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని కించపరచడం హేయమని మండిపడ్డారు.


ప్రకాశ్ రాజ్ తన తల్లి నమ్మకాన్ని గౌరవిస్తూ చర్చికి వెళ్లినప్పుడు అందరూ ఆయన్ని సంస్కారవంతుడిగా చూశారని, కానీ అదే వ్యక్తి శ్రీరాముడిని అవహేళన చేసినప్పుడు ఆయనలోని సంకుచిత బుద్ధి బయటపడిందని వ్యాఖ్యానించారు. నాస్తికత్వం అంటే దేవుడిని నమ్మకపోవడం మాత్రమే కానీ... ఇతరుల నమ్మకాలను కించపరచడం కాదని హితవు పలికారు.


లక్ష్మణుడిని రాముడు 'లక్కీ' అని పిలుస్తాడని, రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని, దానికి శూర్పణఖ జీఎస్టీతో బిల్లు వేసిందంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వెకిలి వ్యాఖ్యలు ఆయన ఉన్మాదానికి పరాకాష్ఠ అని ఎండగట్టారు. రాముడు ఉత్తరాది వాడని, రావణుడు దక్షిణాది వాడని ప్రకాశ్ రాజ్ చేస్తున్న ప్రచారం ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే కుటిల ప్రయత్నం అని విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతను ప్రకాశ్ రాజ్ ఒక మతంపై ద్వేషంగా మార్చుకుంటున్నారని, ఇది ఆయన వినాశనానికే దారితీస్తుందని నాగ మహేశ్ హెచ్చరించారు.
Advertisement
Prakash Raj
Naga Mahesh
Tollywood

More Telugu News