బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల ఘటన యావత్ సినీ పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సినీ ప్రముఖులు తమ భద్రతపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు స్టార్లకు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా నటుడు తుషార్ కపూర్‌కు కూడా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయితే, ఈ బెదిరింపులు నిజమా? లేక ఆకతాయిల పనా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్‌లో భయానక వాతావరణం నెలకొంది.

భద్రతకు పెరిగిన డిమాండ్
ఈ ఘటన తర్వాత సెలబ్రిటీల నుంచి భద్రత కవరేజీ కోసం డిమాండ్ పెరిగిందని నటుడు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు రోనిత్ రాయ్ 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. "ఇది నిజమే.. సెలబ్రిటీల నుంచి భద్రతను పెంచాలనే డిమాండ్ వస్తోంది. ఇదంతా ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు" అని ఆయన వివరించారు. పలువురు ప్రముఖులకు భద్రత కల్పిస్తున్న సిబ్బంది కూడా కాల్పుల ఘటన తర్వాత తమ క్లయింట్ల భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

భయంతోనే ఉన్నాం: సినీ కార్మిక సంఘం
ఈ ఘటన పరిశ్రమలోని నటీనటులు, దర్శకులు, నిర్మాతల్లో భయాన్ని నింపిందని 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' (ఎఫ్‌డ‌బ్ల్యూఐసీఈ) అధ్యక్షుడు బీఎన్ తివారీ అన్నారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ ఘటన జరిగింది. పట్టపగలు, జనం మధ్యలో, పోలీస్ స్టేషన్ ముందే కాల్పులు జరగడం సహజంగానే భయాన్ని సృష్టించింది. కళాకారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రాణం అందరికీ విలువైందే కాబట్టి ఈ భయం అందరిపైనా ప్రభావం చూపుతోంది" అని అన్నారు.

"దీన్ని భయం అనడం కంటే, ముందు జాగ్రత్త చర్య అనడం సరైంది. అనవసరంగా బయట ప్రదేశాలకు వెళ్లడం, కారణం లేకుండా ఇతరులను కలవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది" అని తివారీ సూచించారు.

కనిపిస్తున్న మార్పులు
భద్రత పెరిగిన విషయం ప్రముఖుల బహిరంగ కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఆదివారం అభిమానులతో ముచ్చటించే అమితాబ్ బచ్చన్, ఈసారి తన జుహూ నివాసం వెలుపల ఒక బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఎన్‌క్లోజర్ వెనుక నుంచి అభివాదం చేశారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నిన్న‌ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం 'మన్నత్' వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి, అభిమానులను మొదట బంగ్లా దగ్గరకు అనుమతించలేదు. తర్వాత షారుఖ్ తన కుటుంబంతో కలిసి టెర్రస్‌పైకి వచ్చి, అభిమానులకు చాలా దూరం నుంచే అభివాదం చేశారు. సాధారణంగా చేసే విధంగా కాంపౌండ్ వాల్ దగ్గరకు రాలేదు.

ఇదిలా ఉంటే.. టైగర్ ష్రాఫ్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడిన షూటర్లు.. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి ఇతర స్టార్ల ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు వచ్చిన నివేదికలు ఆందోళనను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సీనియర్ వర్కర్స్ అసోసియేషన్ బాలీవుడ్ ప్రముఖులకు పటిష్ఠ‌మైన భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మొత్తం మీద ఈ కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో వ్యక్తిగత భద్రత అనే అంశాన్ని మరోసారి తీవ్రంగా చర్చకు తెచ్చింది.