టాలీవుడ్‌లో మరోసారి పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఒకేసారి ఇద్దరు యువ హీరోల పెళ్లిళ్ల విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మెగా హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతుండగా, మరో యంగ్ హీరో తేజ సజ్జా తన పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించారు.

మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయి దుర్గా తేజ్ వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రచారం ప్రకారం, నవంబర్ 5న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సాయి తేజ్ నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. 

అయితే, ఆయన వివాహం చేసుకోబోయే అమ్మాయి వివరాలను చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక, డిసెంబర్ 10న వివాహం జరిపి, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి గానీ, సాయి తేజ్ నుంచి గానీ అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి స్పష్టత రానుంది.

ఒకవైపు సాయి తేజ్ పెళ్లిపై ప్రచారం జరుగుతుండగా, మరోవైపు యంగ్ హీరో తేజ సజ్జా తన పెళ్లి విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికాలో నివసిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని, కాబోయే భార్యకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తేజ స్పష్టం చేశారు. 

నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు కూడా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఇలా ఒక హీరో పెళ్లి వార్త ప్రచారంలో ఉండగా, మరో హీరో అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్‌లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.